గాంధీలో కేసీఆర్.. ప్యాలెస్‌లో జగన్! అభినవ నీరో చక్రవర్తా?
posted on May 19, 2021 @ 3:42PM
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయసు 74 ఏండ్లు.. అయినా ఆయన కొవిడ్ కట్టడి చర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భువనేశ్వర్ లోని కొవిడ్ హాస్పిటల్ ను విజిట్ చేసి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వయసు 67 ఏండ్లు. ఆయన ఇటీవలే కరోనాను జయించారు. మాములుగానే కేసీఆర్ ఎక్కువగా బయటకి రారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా ఉంటారని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అలాంటి కేసీఆర్ కూడా కొవిడ్ నియంత్రణ చర్యల్లో దూకుడుగా వ్యవరిస్తున్నారు. కొవిడ్ హాస్పిటల్ గా ఉన్న గాంధీకి హాస్పిటల్ ను సందర్శించి అందరని ఆశ్చర్యపరిచారు. పీపీఈ కిట్టు కూడా వేసుకోకుండానే ఏకంగా కోవిండ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు కేసీఆర్. కోవిడ్ రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైద్యులతో చర్చించారు. వారి సేవలు కొనియాడారు. వసతులు, చికిత్సలపై ఆరా తీశారు. ఆక్సిజన్ కొరత, మందులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే తరలిరావడంతో కొవిడ్ బాధితుల్లో ధైర్యం.. వైద్య సిబ్బందిలో మరింత బాధ్యత, ఉత్సాహం పెరిగింది.
65 ఏండ్ల వయసుకు పైబడి ఉన్న ముఖ్యమంత్రులు కూడా కొవిడ్ రోగులను నేరుగా పరామర్శిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ మరోలా ఉంది. ఏపీకి 48 ఏండ్ల యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫలితం లేకుండా పోయింది. కరోనా పై జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ప్యాలెస్ ను విడిచి రావడం లేదు.. అక్కడే కూర్చొని సమీక్షల పేరుతో చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి.. కొవిడ్ రోగులతో స్వయంగా మాట్లాడటంతో .. ఏపీ సీఎం జగన్ వ్యవహారశైలిపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో కంటే ఏపీలో డబుల్, త్రిబుల్ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, మందులు.. సరిగ్గా అందుబాటులో లేవనేది పేషెంట్స్ మాట. విజయనగరం, అనంతపురం, తిరుపతి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిలిచి కరోనా బాధితులు చనిపోవడం.. ఏపీకి తలవొంపులు తీసుకొచ్చింది. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆసుపత్రుల ముందు కరోనా రోగుల పడిగాపులు, అంత్యక్రియలకూ దిక్కులేని పరిస్థితులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాడెపల్లి ప్యాలెస్ వీడి బయటకు రావడం లేదని అంటున్నారు విపక్ష నేతలు. కరోనా ఏపీని అల్లకల్లోలంగా మారిస్తే.. జగన్‌రెడ్డి సర్కారు చేతగాక చేతులెత్తేసిందని విమర్శిస్తున్నారు.కర్ఫ్యూ ప్రకటించేసి.. ఇక ప్రభుత్వం చేసేది ఏమీ లేదు.. మీ చావు మీరు చావండన్నట్టు సర్కారు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. మరణిస్తే.. అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వడం ముఖ్యమా? అసలు చనిపోయే పరిస్థితే రాకుండా మెరుగైన వైద్యం అందించడం ప్రధానమా? జగన్‌రెడ్డికే తెలియాలి అంటున్నారు.
ఏపీలో కరోనా చికిత్సకు అసలేమాత్రం అనుకూల పరిస్థితులు లేవు కాబట్టే.. అంబులెన్సుల్లో పెద్ద సంఖ్యలో కొవిడ్ బాధితులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. అలాంటి వారిని సరిహద్దుల్లోనే తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలోనూ జగన్‌రెడ్డి నోరు మెదపలేదు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏపీలో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మెడిసిన్ లేకనే.. తాము హైదరాబాద్ వెళుతున్నామని బాధితులే స్వయంగా మీడియా ముఖంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనం.కొవిడ్ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కక్ష సాధింపు కేసులంటోంది విపక్షం.
ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని చేశారు కేసీఆర్. మరి, జగన్‌రెడ్డి ఏం చేస్తున్నట్టు? తాడేపల్లి ప్యాలెస్ వీడి ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావడం లేదు? తిరుపతి రుయా హాస్పిటల్‌లో ఆక్సిజన్ నిలిచి అంతమంది చనిపోతే జగన్ ఎందుకు రుయా ఆసుపత్రిని పరిశీలించలేదు? తెలంగాణ సర్కారు ఏపీ అంబులెన్సులను ఆపుతుంటే ఆలా మౌనంగా ఉండటమేంటి? ఏపీ వ్యాప్తంగా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత వేధిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు? తెలంగాణలోకంటే ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నా.. కేసీఆర్‌లా సీఎం జగన్ కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా పరిశీలించారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోందో స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్నారుగా? కరోనా సోకే ప్రమాదం తక్కువేగా? అయినా, ఎందుకంత భయం? అది భయమా? లేక, బాధ్యతా రాహిత్యమా? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా జగన్‌రెడ్డి వ్యవహరం ఉందంటూ మండిపడుతున్నాయి. కనీసం మీ మిత్రుడు కేసీఆర్‌ను చూసైనా నేర్చుకోవాలని.. ఇప్పటికైనా ప్యాలెస్ వీడి కొవిడ్ కట్టడి చర్యల కోసం ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి, ముఖ్యమంత్రిగారు మెట్టు దిగి.. దిగొస్తారా? ప్రజల వేదన వింటారా? కరోనా కట్టడికి మెరుగైన చర్యలు చేపడతారా? ఏమో.. డౌటే.. అంటున్నారు.