కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?!
posted on Sep 14, 2022 @ 10:59AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హుజురాబాద్ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారా?ఈటల చేతిలో ఓటమిని అయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? ‘గులాబీ పార్టీకి ఓనర్లం మేమే’ అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించి తలెగరెసిన బడుగు వర్గాల నేతను కేసీఆర్ ఇప్పటికీ ఉపేక్షిచలేకుండా ఉన్నారా? అందుకేనా, ఈటల అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, సభలో బడుగుల గళం వినిపించకుండా, ఏదో ఒక కారణం చూపించి, సస్పెండ్ చేయించి బయటకు పంపుతున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అవును, కొందరు తెరాస నాయకులు కూడా, వ్యక్తిగత సంభాషణల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల పట్ల వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకున్నారని అంగీకరిస్తున్నారు.
అంతే కాకుండా, ముఖ్యమంత్రి అచనాలు, ఆలోచనలు భిన్నంగా ఈటల కాంగ్రెస్’లో కాకుండా బీజేపీలో చేరడం కూడా ఆయన కోపానికి కారణం అంటున్నారు. హుజురాబాద్’ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసేఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కోట్ల రూపాయలు కుమ్మరించారు. రాజకీయ తాయిలాలు ఎరగా వేశారు. హుజురాబాద్ నియోజక వర్గంలో గతంలో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి (కాంగ్రెస్) ఎల్. రమణ (టీడీపీ), పెద్ది రెడ్డి (బీజేపీ) ఇలా నియోజక వర్గంపై ఎంతోకొంత పట్టుందని భావించిన ఇతర పార్టీల నాయకులకు పదవులు ఎరగా వేసి, పార్టీలో చేర్చు కున్నారు.
నిజానికి ఇతర పార్టీల నాయకులు మాజీ ప్రజా ప్రతినిదులనే కాదు, సొంత పార్టీ కి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ఈటల వైపు వెళ్ళకుండా ఉండేందుకు, ఏమేమి చేయకూడదో అవ్వన్నీ చేశారు. నామినేటెడ్ పదవులు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాలు ఆశగా చూపి ఎవరూ గట్టు దాటకుండా కట్టడి చేశారు.ఇక ఓటు రేటు ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పనకరలేదు. ఇన్నెందుకు కానీ, కనివినీ ఎరగని రీతిలో ఇటు ప్రభుత్వ నిధులు, అటు పార్టీ ఫండ్స్ విచ్చల విడిగాఖర్చు చేసి, చివరకు, ‘అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక’ గా హుజురాబాద్ ఉప ఎన్నికను చరిత్ర పుటల్లో చేర్చారు. నిజానికి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసింది గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అయినా ఓడి పోయింది మాత్రం కేసీఆర్, అనే అభిప్రాయం, జనంలోకి వెళ్ళింది. అందుకే, ఈటల గెలిచినా సభలో ఆయన కనిపించారదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని, ఈటల చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలిచిన తర్వాత గత మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి, ఇప్పడు మళ్ళీ ముచ్చటగా మూడు రోజులు వ్ర్శకాల్ సమావేశాలు జరిగాయి జరిగాయి. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజునే,ఈటలతో పాటుగా ముగ్గురు, బీజేపీ ఎమ్మెల్యేలను సహేతుకకారణం ఏదీ లేకుండానే, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్’ చేశారు. ఇప్పుడు మూడు రోజుల సభలో, సభ వెలుపల స్పీకర్’ గురించి చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపించి,సస్పెండ్ చేసారు. ఇలా, ఈటల చూడడం ఇష్టం లేకనో, ఈటల సభలో మాట్లాడితే, ఎవైనా నిజాలు బయటకు వస్తయ్యనో మొదటి రోజు నుంచి చివరి రోజువరకు ఈటల సభలో లేకుండా సస్పెండ్ చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందనే విమర్శలతో పాటుగా, ముఖ్యమంత్రి ఈటలకు భయపడుతున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈటల రాజేందర్’కు తెరాస లోగుట్లు అన్నీ క్షుణ్ణంగా తెలుసనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంతే కాదు, ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలకు ప్రభుత్వ గుట్టుమట్లు కుడా అరచేతిలో లెక్కల్లా కొట్టిన పిండి అంటారు. నిజానికి, మూడు రోజుల సభలో చివరి రోజు ఎఫ్ఆరబిఎం పై చర్చ కారణంగానే తనను బయటకు పంపారని ఈటల పేర్కొన్నారు. అందుకే, సభలో ఈటల వాయిస్ వినిపించకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. అయితే, మోడీతో గోక్కోవడం ఏమో కానీ, ఈటలతో గోక్కోవడం మాత్రం బూమ్రాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు.ఒక బీసీ నేతను, అవినీతి ఆరోపణలు చేసి అత్యంత అవమానకరంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి బయటకు పపండమే కాకుండా, సభలో ప్రవేశించకుండా అడ్డుకోవడం, అవమానించడం తెరాసలోని బీసీ ఎమ్మెల్ల్యేలు, నాయకులు కూడా జీర్నిచుకోలేక పోతున్నారని అంటున్నారు.
ఇతర విషయాలు ఎలా ఉన్నా ఈటల విషయంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం, ఇతర పార్టీలలో కంటే తెరాసలోనే ఎక్కువగా వినిపిస్తోందని, అంటున్నారు. మరో వంక ఈటల, కేసీఆర్’ ను ఓడించక పొతే, నా పుట్టుకే వ్యర్థం అంటూ పరోక్షంగా క్యాస్ట్ కార్డు సంధించారని అంటున్నారు. ఒక విధంగా తెరాసలో ఉండగా చేసిన ‘గులాబీ పార్టీకి ఓనర్లం మేమే’ అంటూ చేసిన సవాలుకు కొనసాగింపుగానే ఈటల తాజాగా చేసిన, ‘కేసీఆర్’ ను ఓడించక పొతే, నా పుట్టుకే వ్యర్థం’ అంతో చేసిన సవాలును చూడవలసి ఉంటుంది అంటున్నారు. అదే నిజమే, రాష్ట్ర రాజకీయం కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారితే మాత్రం,అది తెరాసకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.