ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటిన్లు.. చంద్రబాబు నిర్ణయం
posted on Sep 14, 2022 @ 10:47AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు సజావుగా నడవనివ్వకుండా వైసీపీ సర్కార్ అల్లర్లు చేస్తుండడంతో పాటు పలుచోట్ల వైసీపీ నేతలు అన్న క్యాంటీన్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అసలు వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసేసింది.
పేదవాడికి చౌకగా పట్టెడన్నం పెట్ట మహత్తర కార్యానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తున్న క్రమంలో తెలుగుదేశ అంధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎక్కడికక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, పేదలకు భోజన సదుపాయం కల్పించాలని టీడీపీ నేతలను ఆయన ఆదేశించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోను, నారా లోకేశ్ గతంలో పోటీ చేసిన మంగళగిరిలోను, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో, మరి కొన్నిచోట్ల మాత్రమే ప్రస్తుతం అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా అన్న క్యాంటీన్లను ఆ పార్టీ నేతలు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్లను సొంత ఖర్చులతో నిర్వహించాలని, స్వచ్ఛంద సంస్థలు కలిసివస్తే.. వాటి సహాయమూ తీసుకోవాలని, అలాగే తెలుగుదేశం తరఫున కూడా అన్న క్యాంటీన్ల నిర్వహణకు కొంత నిధి సమకూరుస్తామని చంద్రబాబు తమ పార్టీ నేతలకు చెప్పారు.తెలుగుదేశం నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలను అన్న క్యాంటీన్లలో నిర్వహించి, భోజనాలు వాటిలోనే ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
అన్న క్యాంటీన్లు సజావుగా నడిస్తే.. టీడీపీకి మంచి పేరొస్తుందని, తద్వారా పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందనే అక్కసుతోనే జగన్ సర్కార్, ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అన్న క్యాంటీన్లకు అడ్డు తగులుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే.. అన్న క్యాంటీన్ ను కాసేపట్లో ఆయన ప్రారంభిస్తారనగా వైసీపీ నేతలు ఆ క్యాంటీన్ బ్యానర్లను చింపి వేసి ఆహార పదార్థాలున్న పాత్రలను ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోనూ, మరికొన్ని చోట్లా కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే సాకుతో అన్నా క్యాంటీన్లను వైసీపీ నేతలు కూల్చివేశారు. అన్నా క్యాంటీన్లపై ప్రజల్లో ఆదరణ పెరిగిపోతే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల వర్షం కురుస్తుందని, తద్వారా తమ అధికారానికి ఎండ్ కార్డ్ పడుతుందని వైసీపీ నేతల్లో గుబులు పెరిగిపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే అన్న క్యాంటీన్లకు అడుగడుగునా వైసీపీ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని పేర్కొంటున్నారు.
అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకోవడమే కాకుండా, కొన్ని చోట్ల పోలీసులతో లాఠీచార్జి కూడా చేయిస్తుండడంతో ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలపై దాడి చేసి, వారిని అరెస్టులు చేయిస్తున్న ఘటనలు చూసిన జనం ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దాడులకు గురైన టీడీపీ నేతల పట్ల జనంలో సానుభూతి వస్తుందని, అతి తక్కువ ధరకే పేదలకు పట్టెడన్నం పెడుతుంటే వైసీపీ అడ్డుకుంటోందనే ఆగ్రహం కూడా ప్రజల్లో వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారని అంటున్నారు.