పార్లమెంట్ కు కవిత! ఎమ్మెల్సీగా బండా ప్రకాష్.. కేసీఆర్ ఖతర్నాక్ గేమ్
posted on Nov 16, 2021 @ 10:29AM
శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్టులు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనూహ్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. రాజ్యసభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇంకా మూడేళ్ల పదవి ఉన్న బండాను రాజ్యసభకు రాజీనామా చేయించి శాసనమండలికి పంపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బండా ప్రకాష్ తో పాటు శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇక ఐఏఎస్ గా వాలంటరీ రిటైర్మెట్ ప్రకటించిన వెంకట్రామిరెడ్డిని కూడా ఎమ్మెల్యే కోటాలోనే శాసనమండలి ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు సీఎం కేసీఆర్.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఖతర్నాక్ స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. తన కూతూరు కవితను పెద్దల సభకు పంపించడంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయడమే గులాబీ బాస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత. ఆమె పదవి కాలం త్వరలోనే ముగియనుంది.నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో కవితను మళ్లీ మండలికి కాకుండా ఢిల్లీకి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ తో రాజీనామా చేయిస్తున్నారని చెబుతున్నారు.బండా ప్రకాశ్ ఎంపీ పదవి కాలం ఇంకా మూడేండ్లకు పైగానే ఉంది. దీంతో బండా స్థానంలో రాజ్యసభకు కవితను పంపించనున్నారు కేసీఆర్.
బండా ఎంపికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. కేబినెట్ నుంచి గత జూన్ లో ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడంతో రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీసీ సంఘాలు కూడా కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆ ప్రభావం కనిపించిందనే అంచనాకు కేసీఆర్ వచ్చారట. అందుకే బీసీ సంఘాలతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా తాజా ఎత్తుగడ వేశారంటున్నారు. ఈటల సామాజిక వర్గానికే చెందిన బండా ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా చేసి.. తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆ విధంగా ఈటల రాజేందర్ ప్లేస్ ను బండా ప్రకాశ్ తో సరిచేస్తారని చెబుతున్నారు.
కవితను రాజ్యసభకు పంపించడంలోనూ కేసీఆర్ వ్యూహం ఉందంటున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ సాగుతుందనే ప్రచారం ఉంది, కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందనే చర్చ సాగుతోంది. అందుకే ఈసారి కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదంటున్నారు, అంతేకాదు ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కాలేదు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి ఆమె డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కూతురును కూల్ చేయడంతో పాటు కేటీఆర్ కు రాష్ట్రంలో సమస్యలు లేకుండా కేసీఆర్ తాజా స్కెచ్ వేశారంటున్నారు. కవితను ఢిల్లీకి పంపించి ఇక్కడ కేటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తున్నారని అంటున్నారు. పార్టీ ఢిల్లీ వ్యవహారాలను కవితకు అప్పగిస్తారని, అవకాశం ఉంటే కేంద్రమంత్రిగా కవితకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.
మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఇచ్చిన ట్విస్టులపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈటల రాజేందర్ తో నష్టపోయిన స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు కవితను రాజ్యసభకు పంపి.. కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.