కేంద్రం నిధులిచ్చినా ఖర్చు చేయని సర్కార్! కేసీఆర్ తీరుతో పేదలకు నష్టం..
posted on Jul 21, 2021 @ 3:17PM
కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమే అయినా ప్రజల సోమ్ముతోనే, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. ఇందుల కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి తమ సొంత సంపద నుంచి ఇచ్చేది చిల్లిగవ్వ కూడా ఉండదు. అయినా, ప్రతిపార్టీ, ప్రతినాయకుడు కూడా తమ సొంత జేబులోంచి తీసి ప్రజల జేబులు నింపుతున్నామని, సంక్షేమ పథకాల అమలుకు ఇన్ని వేల కోట్లు,అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు పోతారు.
నిజానికి,రాజకీయ పార్టీలు, నాయకులే సక్రమంగానో అక్రమంగానో ప్రజల సొమ్ము అనుభవిస్తారు. పండిన ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని సామెత, అదేమో కానీ, రాజకీయ నాయకులు తినే ప్రతి మెతుకు మీద, ప్రజల పేరే ఉంటుంది. ప్రజలు తమ రక్తం, చెమట కలిపి చేసిన సిరాతో చేసిన సంతకమే ఉంటుంది. అది రాజకీయం.ఆ విషయాన్ని అలా ఉంచితే, కేంద్రానికి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పేరొస్తుందని, లేదా ఆ పార్టీకి వచ్చే ఓట్లు పది పెరుగుతాయనో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయక పోవడం, అప్పుడప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, మేధావి, మీడియా వర్గాల్లోనూ చర్చకు వచ్చిన సందర్భాలు లేక పోలేదు. ఇలా కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయక పోవడం వలన రాజకీయ లాభనష్టాలు ఎలాఉన్నా ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు మొదటినుంచి కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం అందరికీ తెలిసిందే. అలాగే, కేంద్ర ప్రభుత్వనిధులతో అమలయ్యే పథకాలలో కూడా కేంద్రం పేరు బయటకు రాకుండా,’కేసీఆర్ కిట్స్’ అనో మరోటనో సొంత పేర్లు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కొన్ని పథకాల విషయంలో అయితే అది రాజకీయ వివాదాలకు దారి తీసిన సందర్భాలు కూడా లేక పోలేదు. కిలో రూపాయి బియ్యం పధకంలో కేంద్రం సమకూర్చే నిధులు ఎక్కువగా, రాష్ట్రం సమకూర్చే నిధులు నామమాత్రంగా ఉంటాయి.అయినా సబ్సిడీ బియ్యం క్రెడిట్’ను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాన్ని, నిన్నమొన్నటిదాక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అదేమంటే ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీనే అద్భుత పథకమని ముఖ్యమత్రి సమాధానం. అయితే ఆయుష్మాన్’లోలాగా ఆరోగ్యశ్రీలోనూ కరోనాను, చేర్చాలని విపక్షాలు వెంట పడడంతో, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్టేట్’లో అములు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంజీఏవై) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మంగళవారం లోక్ సభకు తెలిపారు.అంటే కాదు, 2016-17లో ఈ పథకం కింద విడుదల చేసిన రూ.190.78 కోట్లను ఈ కారణంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని ఆమె వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పేద ప్రజల సొంత ఇంటి కలలను నిజమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈపధకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే,రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం నిదులను వెనక్కి పంపమని కోరింది. గడచిన ఏడేళ్ళలో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.849.01 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో 2016, 2017 ఆర్థిక సంవత్సరాలకు కేటాయించిన రూ.190.78 కోట్లను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.
ఇదే అదనుగా రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తే.. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మదిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన పథకం కింద రాష్ట్రానికి 70వేలకు పైగా ఇళ్లు మంజూరైతే. ఒక్కటి కూడా కట్టలేదని బండి ఆరోపించారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రానికి వచ్చిన 70 వేల ఇల్లు వెనక్కి వెళ్లి పోయాయి.