కమ్మ, రెడ్డిను ఏకం చేసిన క్రెడిట్ కేసీఆర్ దే!
posted on Nov 5, 2023 @ 2:39PM
రాజకీయాలలో కులాల మధ్య పెత్తనం కోసం పోరాటం సహజంగానే కనిపిస్తుంది. మన దేశ చరిత్ర చూస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఈ తరహా రాజకీయాలు కనిపిస్తుంటాయి. అయితే, గతంలో ఇది రాజకీయాలకు పరిమితం కాగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కొంతమేర రాజకీయాలను దాటి మనుషులను కూడా వేరు చేసేదిగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆ సంగతి పక్కనపెడితే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్ర రాజకీయం కనిపిస్తున్నది. మనం మొదట చెప్పుకున్నట్లుగా రాజకీయాలలో కులాల మధ్య పోరాటం తెలుగు నాట కాస్త గట్టిగానే కనిపిస్తున్నది. ఓ రెండు బలమైన సామజిక వర్గాల మధ్య ఇక్కడ రాజకీయ వైరం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి.. తెలుగు నాట రాజకీయం మొదలైన నాటి నుండే కమ్మ, రెడ్డి సామజిక వర్గాల మధ్య వైరం నడుస్తూ వచ్చేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామజిక వర్గం దన్నుగా ఉండగా.. మరో బలమైన కమ్మ సామజిక వర్గం నేతలు కమ్యూనిస్టు పార్టీలలో ఉండేవారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రంతో కమ్మ వర్గం టీడీపీకి తరలి వెళ్ళింది.
అప్పటి నుండి కాంగ్రెస్ కు రెడ్డి వర్గం, టీడీపీకి కమ్మ వర్గం అండగా ఉండగా ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ రాజకీయాలు నడిచేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత.. రాజకీయాలలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించగా.. రెడ్డి సామజిక వర్గం గంపగుత్తగా వైసీపీ పంచన చేరింది. కమ్మ సామజిక వర్గం టీడీపీ వైపు అలాగే కొనసాగింది. తెలంగాణలో టీడీపీ స్థానాన్ని టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) ఆక్రమించగా కాంగ్రెస్ అలాగే కొనసాగుతుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఏపీలో రాజకీయ శత్రువులుగా ఉన్న కమ్మ, రెడ్డి సామజిక వర్గాలు తెలంగాణలో ఇప్పుడు ఒక్కటయ్యాయి.
తెలుగు నాట రాజకీయాలలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఒకే తాటి పైకి వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. గత ఎన్నికలలో టీడీపీ ఇక్కడ కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా కమ్మ సామజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు సామజిక వర్గాలు ఏక తాటిపైకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. వేర్వేరు రాజకీయ కారణాలతో ఇప్పుడు తెలంగాణలో కమ్మ సామజిక వర్గం, రెడ్డి సామజిక వర్గం కలిసి నడుస్తున్నది. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ దేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఈ పరిస్థితికి ఒక కారణంగా చెప్పుకోవాలి. గత ఏపీ ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ అండగా నిలవడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ అగ్ర నేతలు స్పందించిన తీరు తదితర అంశాలు కేసీఆర్ పట్ల కమ్మ సామజిక వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. దీంతో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ వైపున ఉన్న టీడీపీ సానుభూతి పరులైన కమ్మ సామజిక వర్గం ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరమయ్యారు.
అదే సమయంలో చంద్రబాబు అరెస్టు అంశంలో కేంద్రం హస్తం ఉందనే బలమైన ప్రచారంతో కమ్మ సామజిక వర్గం బీజేపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రధసారధిగా రేవంత్ రెడ్డి కమ్మ సామజిక వర్గాన్ని ఆకట్టుకోగలిగారు. తొలి నుండి రేవంత్ రెడ్డి చంద్రబాబును గురుతుల్యునిగా భావించడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. గతంలో మల్కాజ్ గిరిలో రేవంత్ ఎంపీగా విజయం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన కమ్మ సామజిక వర్గం ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే, ఏది ఏమైనా ఈసారి బీఆర్ఎస్ ను గద్దె దింపాలనే ఒకే ఒక లక్ష్యం ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు సామజిక వర్గాలను ఏకం చేసింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ కాగా.. చంద్రబాబు అరెస్ట్, రేవంత్ రెడ్డి ఈ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లే శక్తులుగా పనిచేశాయి. అదే ఈసారి తెలంగాణ ఎన్నికలు వెరీ స్పెషల్ గా మారడానికి కారణమయ్యాయి.