వైసీపీకి ఫైనల్ డేంజర్ బెల్!
posted on Nov 5, 2023 @ 11:07AM
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాను అవినీతి చేసి జైలు పాలైతే.. తన లాగానే అందరూ అవినీతి మరకతో ఉంటే తనను వేలెత్తి చూపకుండా ఉంటారని భావిస్తున్నారో ఏమో సీఎం జగన్ అసలు లేని అవినీతి కేసులను సృష్టించి మరీ విచ్చలవిడిగా కక్షసాధింపు చర్యలకుకు దిగడం ఎంతటి నష్టం చేకూరుస్తుందో మాత్రం అర్ధం కావడం లేదు. జగన్ తమకేదో మేలు చేస్తారని బంపర్ మెజార్టీ ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ఆయన ఇలా ప్రతిపక్షాలను మట్టుబెట్టాలని చూస్తున్నతీరు ఇసుమంతైనా నచ్చడం లేదు? అంతే కాదు.. ఆయన అరాచక పాలన కారణంగా ఈ నాలుగున్నరేళ్లలో తమ జీవన స్థాయి ఎలా దిగజారిపోయిందో కూడా ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది, నాలుగున్నరేళ్ల పాలన అట్టర్ ప్లాప్ కావడంతో ఫ్రస్టేషన్ లో విపక్షాలపై కక్ష సాధింపు చర్యలతో భయపెట్టి, బెదరించి, నిర్బంధించి అధికారాన్ని మళ్లీ దక్కించుకోగలనని భావిస్తున్నారా? లేక అధికారం, మందీ మార్బలం శాశ్వతం అన్న భ్రమలో తానేం చేసినా చెల్లిపోతుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? అసలు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. సుదీర్ఘ కాలం ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని.. క్యాబినెట్ ఆమోదంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తవ్వి తీసి దోషిగా చూపించాలని పడే తపన న్యాయస్థానాలలో ఎంత మాత్రం నిలుస్తుందో ఆయనకి, ఆయన సలహాదారులకు తెలియకుండానే చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలా తప్పు మీద తప్పు.. తప్పుని ఒప్పు చేయాలని మరో తప్పు. నాలుగున్నరేళ్ల పాలనలో చెప్పిన అబద్ధాలు, చేసిన అక్రమాలు ఒకెత్తు అయితే.. ఈ రెండు నెలలలో చేసిన జగన్ సర్కార్ అరాచకాలు మరో ఎత్తు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ సర్కార్ అక్రమంగా స్కిల్ కేసు బనాయించి అంతకంటే అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ కేసు అలా విచారణలో ఉండగానే మరో ఐదు కేసులు నమోదు చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బయటకి వస్తారనే ఉద్దేశంతోనే తరువాత అప్పటికప్పుడు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు, తాజాగా మద్యం, ఆ తరువాత ఉచిత ఇసుక కేసు.. ఇలా ఆరు కేసులు నమోదు చేసింది. మరో మూడు కేసులు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయాలని, ఎన్నికల సమయానికి ఆయన్ని ప్రజలలో మమేకం కాకుండా నిరోధించాలని జగన్ చూస్తున్నారంటున్నారు. చంద్రబాబును బయటకి రాకుండా చేస్తామని వైసీపీ కీలక నేతలు మీడియా ముంగిటే శపధాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సీఎం జగన్ మోహన్ రెడ్డికో.. పార్టీలో అన్నీ తానై నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికో తెలియనిది కాదు. పార్టీ నిర్ణయమే అది కనుక నేతలు ధైర్యంగా ఆ మాట చెప్తున్నారు.
మరి జగన్ ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? చంద్రబాబు అరెస్ట్ ఒక్కటే తన గెలుపుకు సోపానంగా ఆయన ఎందుకు భావిస్తున్నారన్నది పరిశీలకులకు కూడా అంతు చిక్కడం లేదు. ఎందుకంటే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలలో చంద్రబాబు పట్ల ఉన్న అభిమానం ఎంతటిదో అందరికీ అర్ధమైంది. అక్రమంగా జగన్ సర్కార్ బాబును అరెస్టు చేయడంపై జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు పట్ల సానుభూతి వ్యక్తమైంది. ఆయనకు సంఘీభావం తెలపడానికి జనం వెల్లువలా రోడ్ల పైకి వచ్చారు. అసలే నాలుగేళ్ళ పాలనపై అసంతృప్తికి తోడు చంద్రబాబు అరెస్ట్ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై విముఖత వ్యక్తమైంది. వేల కోట్ల అవినీతి కేసులలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. కేవలం 27 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాన్ని అవినీతిగా పేర్కొంటూ అర్ధరాత్రి సమయంలో 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును బస చేసిన శిబిరం నుండే ఎత్తుకురమ్మని పోలీసులను పురమాయించారంటే ఇది ఏ స్థాయి అరాచకమో ప్రజలకు అర్ధమైంది. అసలు తాను దేశంలో లేనని జగన్ ప్రకటనలు చేయొచ్చు కానీ.. వాస్తవం గ్రహించలేని స్థితిలో ప్రజలు లేరన్నది సుస్పష్టం. స్కిల్ కేసు విచారణలో ఉండగానే వరస కేసులు నమోదు చేయడంత జగన్ పై వ్యతిరేకత ప్రజలోకి బలంగా వ్యక్తం అయ్యింది.అదే
మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఫైనల్ డేంజర్ బెల్ మోగించింది. అయినా చంద్రబాబు టార్గెట్ గా వరుస కేసులను తెరమీదకు తీసుకువస్తుండటంతో జనం దృష్టిలో జగన్ ప్రతినాయకుడిగా మారిపోయారు. అధికారం ఉంది కాదా అని ప్రతిపక్షాలపై దాడికి దిగితే ప్రజాగ్రహం ఎంతగా వెల్లువెత్తుతుందన్నది చంద్రబాబు జైలు నుండి విడుదలైన సందర్భంగా ఆయనకు లభించిన అపూర్వ స్వాగతమే కళ్లకు కట్టింది. చంద్రబాబుపై కేసులు, వేధింపులు జగన్ కు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇవొచ్చు కానీ.. ముందు ముందు ఇదే ఆయన రాజకీయ పతనానికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.