కవిత అరెస్టు.. మీడియాకు ముఖం చాటేసిన కేసీఆర్, కేటీఆర్
posted on Mar 16, 2024 @ 9:51AM
బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. కీలక సమయాల్లో మౌనం వహించడం పార్టీ క్యాడర్ లోనూ, నాయకుల్లోనూ కూడా వారిపై నమ్మకాన్నే కాదు, పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న విశ్వాసాన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి.
తాజాగా కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శుక్రవారం (మార్చి 15)అరెస్టు చేసి హస్తిన తరలించింది. ఆ సందర్భంగా కవిత నివాసం వద్ద ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగి హడావుడి చేసిన కేటీఆర్.. ఆ తరువాత మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. కవిత నివాసంలో ఈడీ సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. అక్కడ నుంచి నేరుగా కవిత నివాసానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. తరువాత చిక్కుల్లో పడతారంటూ హెచ్చరించారు. అయితే అవి ఉడుత ఊపులుగానే ఉన్నాయి. ఈడీ అధికారులు వాటిని ఖాతరు చేయలేదు. వారు అనుకున్నది అనుకున్నట్లు చేసేశారు. కవితను అదుపులోనికి తీసుకుని హస్తినకు తరలించారు. ఆ సందర్భంగా పంచనామా రిపోర్టులో కేటీఆర్ తీరుపై కూడా వ్యాఖ్యలు చేశారు.
సరే కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆమె నివాసం ముందు కొంత హడావుడి చేశాయి. ఈ తతంగం అంతా అయిపోయిన తరవాత శనివారం(మార్చి 16) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని హరీష్ రావు మీడియా ఎదుట వెల్లడించారు. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ కనిపించలేదు. అంతే కాదు.. కవిత అరెస్టును ఖండిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారే తప్ప బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడలేదు.
ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే ఆయన కూడా మీడియాకు ముఖం చాటేశారు. తన కుమార్తె అరెస్టును ఖండిస్తూ మీడియా ఎదుటకు రావడానికి ఆయన సుముఖత చూపలేదు. దీంతో కేసీఆర్, కేటీఆర్ కాడె వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి కవిత అరెస్టునకు నిరసనగా ఆమె నివాసం ఎదుట బీఆర్ఎస్ నేతల ఆందోళన వినా రాష్ట్రంలో మరెక్కడా నిరసనలు కనిపించలేదు. జనం ఈ అరెస్టుపై పెద్దగా స్పందించినట్లు కనిపించదు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించాల్సిన కేసీఆర్, కేటీఆర్ కనీసం మీడియాకు కూడా ముఖం చూపించకపోవడంపై పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.