సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే
posted on Mar 16, 2024 9:20AM
18వ లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం(మార్చి 16) మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఈ మేరకు ఈసీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం ఈసీ స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించాలని ఈసీ నిర్ణయిస్తే ఈ రోజు సార్వత్రిక ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకూ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వేరుగా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలు మే లోగా పూర్తి కావాల్సి ఉంది.
గత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10న విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి. అయితే 2024 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నికల కంటే పది రోజులు ఆలస్యంగా షెడ్యూల్ పూర్తి చేసింది. దీంతో ఈ సారి ఎన్నిదశలలో ఎన్నికలు నిర్వహిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.