అక్కడ మందుగోలీ.. ఇక్కడ మసాజ్.. నేతల సేవే ప్రజాసేవా?
posted on Mar 18, 2021 @ 3:14PM
ఒకప్పుడు ప్రజాసేవ చేసిన వారికే పదవులు. ఇప్పుడు నేతలకు సేవ చేసిన వారికే అందలాలు. తమకు ఎవరు ఊడిగం చేస్తే వారికే ఉన్నత స్థానాలు. వేరే అర్హతలు ఏవీ అవసరం లేదు. స్వామి భక్తి ప్రదర్శిస్తే చాలు. కోరుకున్న సీటు కోరి వరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి.
రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. కేసీఆర్‌కు మాత్రం బాగా కావలసిన వాడు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ప్రజల కోసం పోరాడలేదు. అయినా, రాజ్యసభ సభ్యులు అయిపోయారు. ఆయనకు ఉన్న అర్హతల్లా కేసీఆర్ మనిషి కావడం మాత్రమే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ గులాబీ బాస్ వెంటే ఉన్నాడట. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆయన్ను వీల్ ఛైర్‌లో తీసుకెళ్లింది ఆయనే. సీఎం కేసీఆర్‌కు నిత్యం మందుగోలీలు ఇచ్చేది కూడా ఆయనే అట. ఈ ఆరోపణ చేసింది మరెవరో కాదు. అప్పటి టీఆర్ఎస్ నేత కొండా సురేఖనే స్వయంగా ఈ మాట అన్నారు. అలాంటి మందుగోలీలు ఇచ్చే సేవకుడికి.. పార్లమెంట్ పెద్దల సభకు పంపిన పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
కొంచెం అంటూ ఇటూగా.. ఏపీలోనూ ఇదే సీన్. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఫిజియోథెరపిస్టు గురుమూర్తు. అప్పటి వరకూ అతను వైసీపీ సభ్యుడు కూడా కాదు. ఫిజియోథెరపిస్టుగా ఆయన తిరుపతి వాసులకు చేసిన సేవ కూడా ఏమీ లేదు. అయినా.. ఏరికోరి మరీ తిరుపతి సీటు ఆయన్ను వరించింది. అందుకు గురుమూర్తికి ఉన్న అర్హతల్లా.. జగన్‌కు పాదసేవ చేయడమే. అదేనండి.. పాదయాత్ర సమయంలో జగన్‌కు ఫిజియోథెరపిస్టుగా ఉండటమే. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ వెంటే ఉన్నారు గురుమూర్తు. నడకతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. జగన్ కాళ్లకు ఎప్పటికప్పుడు మసాజ్ చేస్తూ.. సపర్యలు చేస్తూ వచ్చారు. అప్పుడు తనకు చేసిన పాదసేవకు మెచ్చి.. ఇప్పుడు గురుమూర్తిని తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు.
ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయని సీనియర్లు వాపోతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, సమస్యలపై పోరాడుతూ.. చుట్టూ జనం, మధ్యలో మనం అనేలా ఉన్న నేతలనే చట్టసభలకు పంపించే వారు. కానీ, ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేసీఆర్‌కు సేవ చేసినందుకు గాను సంతోష్ కుమార్‌ను రాజ్యసభకు పంపితే.. తనకు పాదసేవ చేసినందుకు గాను ఫిజియోథెరపిస్టు గురుమూర్తికి పార్లమెంట్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇలా తెలుగు రాష్ట్రాలు.. ఇద్దరు నేతలు.. దొందు దొందే అంటున్నారు నిజమైన ప్రజాస్వామ్యవాదలు.