కావూరి సాంబశివరావు రాజీనామా
posted on Oct 27, 2012 @ 7:49PM
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగకముందే రాష్ట్రంనుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి అసమ్మతి సెగ తగులుతోంది. తనకి కేబినెట్ బెర్త్ ఖరారు కానందుకు అలిగిన కావూరి సాంబశివరావు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖని స్పీకర్ కి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకి పంపినట్టు ఢిల్లీ గల్లీల్లో గట్టిగా చెప్పుకుంటున్నారు.
కావూరి అలకను తీర్చేందుకు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ రంగంలోకి దిగి ఎంపీ అలకను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ లేదు. కిందటిసారే క్యాబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించి భంగపడ్డ కావూరి ఈ సారి చాలా కోపంగా ఉన్నారని ఆయన అనుచరగణం అనుకుంటున్నారు.
ఐదుసార్లు లోక్ సభ స్థానానికి ఎన్నికైన తనని కాదని ఎవరెవరికో సీట్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వినికిడి. అధిష్ఠానానికి మొదటినుంచీ విధేయత ప్రకటిస్తూ వచ్చిన కావూరి ఈసారైనా తను అలగకపోతే విలువపోతుందని గట్టిగా అనుకున్నట్టు సమాచారం.