బాబు యాత్రకు నేడు విరామం
posted on Oct 27, 2012 @ 12:36PM
వస్తున్నా మీకోసం పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర 25రోజులు ముగిసిన తర్వాత శనివారం వాయిదా పడిరది. బాబు ఆరోగ్యం క్షీణించడం దీనికి కారణం. అసలే చంద్రబాబు బాగా అలసటగా వున్నారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ బాబు పట్టించుకోకుండా యాత్రను కొనసాగించారు. ఆయన శ్రమకు ఫలితం దక్కి మహబూబ్‌నగర్ జిల్లాలో మంచి స్పందన లభించింది. ఆ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతున్న బాబు, చిన్న ప్రమాదంలో చిక్కుకున్నారు. గద్వాలలో శుక్రవారం రాత్రి బాబు ప్రసంగ వేదిక కూలడంతో వెన్నెముకకు గాయమైంది. దాంతో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. వారి మాట మన్నించిన చంద్రబాబు శనివారం విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించారు. నిజానికి వెన్నెముకకు గాయమైనప్పటికీ యాత్రను కొనసాగించాలని బాబు పట్టుదలగా వున్నారు. అయితే వైద్యులతో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వత్తిడి తెచ్చారు. ఇదిలా వుండగా అస్వస్థతకు గురయిన చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ కలుసుకొని, పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బాబును బాలకృష్ణ పరామర్శించిన విషయం విదితమే.