కాళేశ్వరంలో కేసీఆర్ ను నిండా ముంచేసిన కవిత వ్యాఖ్యలు!?
posted on Sep 2, 2025 @ 1:11PM
కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరగలేవని బీఆర్ఎస్ ఎంతగా గొంతు చించుకుని అరిచినా ఫలితం లేకుండా పోయే పరిస్థితిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ లపై ఆరోపణలు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారం వాస్తవమేనని కవిత కుండ బద్దలు కొట్టేశారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత పులు కడిగిన ముత్యమేనని చెబుతూనే.. మాజీ మంత్రి హరీష్ రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ధృవీకరించేశారు.
దీంతో కాళేశ్వరం విషయంలో అవినీతి లేదని బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులు ఎంతగా గొంతు చించుకున్నా ఫలితం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన తండ్రి సుద్దపూస అంటూ.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినందునే హరీష్ రావుకు రెండో సారి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఇరిగేషన్ శాఖ ఏమిటి తొలుత అసలు హరీష్ ను క్యాబినెట్ లోకే తీసుకోలేదనీ, ఆ తరువాత బతిమలాడుకుంటే కేబినెట్ బెర్త్ ఇచ్చారని ఇప్పుడు కవిత గట్టిగా చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని స్వయంగా కవితే అంగీకరించేసిన తరువాత.. ఇక పార్టీకి డిఫెండ్ చేసుకునే అవకాశం ఎక్కడుంటుందని పరిశీలకులు అంటున్నారు.
ఇంత కాలం కాళేశ్వరంలో అవినీతి అన్నదే జరగలేదని బీఆర్ఎస్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవా లంటూ కవిత ధృవీకరించేశారు. కవిత తన వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ ప్రతిష్టనే కాదు.. స్వయంగా తన తండ్రి ప్రతిష్టను కూడా పాతాళంలోకి తోసేశారని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం డిజైన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కర్తా, కర్మా, క్రియా తానేననీ, ఇంజినీర్లకు డిజైన్ ఎలా చేయాలో కూడా తానే చెప్పాననీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు స్వయంగా ఆయన కుమార్తె కవితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు, అవినీతి నిజమేనని చెప్పడం, అయితే అందుకు తన తండ్రి ప్రమేయం లేదని సమర్ధించడానికి ప్రయత్నించడం ద్వారా కేసీఆర్ ను పూర్తిగా ఇరికించేసినట్లైందని అంున్నారు.
కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటున్న విమర్శకుల నోళ్లు మూయించడం సంగతి పక్కన పెడితే.. కవిత తన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ పై ఆయన విమర్శకులు మరింతగా విమర్శల దాడి చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లైందని అంటున్నారు.