కల్వకుంట్ల కవితకి ఈడీ బర్త్ డే గిఫ్ట్!
posted on May 21, 2024 @ 12:31PM
బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ముద్దుల కుమార్తె కల్వకుంట్ల కవిత జూన్ 3 వరకు తీహార్ జైలులో ఆతిథ్యం తీసుకోక తప్పదన్నదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, చాలామందికి తెలియని విషయం ఒకటి బయటకి వచ్చింది. అందేంటంటే, కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇదేంటి చెప్మా? కవిత బర్త్ డే మార్చి 13వ తేదీ కదా? అప్పటికి కవిత ఇంకా అరెస్టు కాలేదు కదా.. మరి కవిత బర్త్ డే వేడుకలు ఘనంగా జరడానికి ఈడీ అవకాశం ఇవ్వడం ఏమిటా? పైగా బర్త్ డే గిఫ్ట్ కూడా ఇవ్వడం ఏమిటా ఏమిటా అనే సందేహం ఇప్పటికే కొంతమందికి వచ్చి వుండొచ్చు.
ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి... మార్చి 13, 2024వ తేదీకి వెళ్దాం. అప్పటికి రెండు నెలల మూడు నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగి, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగా ఓడిపోయి, పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో వున్నాయి. అలాంటి సందర్భంలో వేసవిలో వర్షంలాగా కవితమ్మ బర్త్ డే వచ్చింది. ఈ సందర్భాన్ని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే సందర్భంగా మలచాలని కవిత ఫిక్సయ్యారు. తన నివాసంలో భారీ స్థాయిలో తన బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వేలాదిమంది కార్యకర్తలు వచ్చారు. డప్పుల చప్పుడుతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కుటుంబ సభ్యులు, భర్త, పిల్లల సమక్షంలో కల్వకుంట్ల కవిత తన బర్త్ డే కేక్స్ కట్ చేశారు. అందరూ ఆనందోత్సాహాలతో చప్పట్లు చరిచారు. అలా ఆరోజు కవిత బర్త్ డే వేడుకలు అద్భుతంగా జరిగాయి.
సరే, వర్తమానంలోకి వద్దాం. కవిత బర్త్ డే ఆ రేంజ్‌లో జరగడానికి, ఈడీకి సంబంధం ఏంటనే సందేహం రావడం సహజం. అయితే, కవితని మార్చి 13వ తేదీకంటే చాలా ముందే ఈడీ అరెస్టు చేయాల్సి వుంది. కానీ, 13 తర్వాతే ఆ పుణ్యకార్యం చేయాలని ఈడీ గ్యాప్ తీసుకుంది. అందుకే, పుట్టినరోజు నాడు కవిత జైల్లో లేకుండా ఇంట్లోనే బర్త్ డే వేడుకలు చేసుకోగలిగింది. మరి ఇది జరిగింది ఈడీ నిర్ణయం వల్లే కదా.. కవితకి ఈడీ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టే కదా!
కవిత బర్త్ డే వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత, మార్చి 15న కవిత ఇంటికి వెళ్ళి ఈడీ అరెస్టు చేసింది. కవిత తన బర్త్ డే చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం వెనుక ఈడీ స్వప్రయోజనం కూడా లేకపోలేదు. బర్త్ డే ముందే అరెస్టు చేస్తే, బీఆర్ఎస్ వర్గాలు ‘తెలంగాణ బిడ్డని బర్త్ డే కూడా చేసుకోనివ్వలేదు’ అని సానుభూతి కోసం పాకులాడే అవకాశం వుండేది. అలాగే బర్త్ డే రో్జున బీఆర్ఎస్ వర్గాలు భారీ స్థాయిలో సీన్ క్రియేట్ చేసి వుండేవి. ఈ గోలంతా ఎందుకని, కవితని ఎంచక్కా బర్త్ డే వేడుకలు చేసుకోనిచ్చి ఆ తర్వాతే ఈడీ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.