ఐటి సంస్థలతో కర్ణాటక మంత్రుల భేటీ
posted on Sep 7, 2022 @ 10:30AM
బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా నగరం స్థంభించిపోయింది. దీంతో బెంగుళూరులోని ఐటి సంస్థల వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆయా పరి శ్రమల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఫోసిస్,విప్రో, టిసిఎస్, ఇంటెల్ ఇతర దిగ్గజ ఐటి సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి సిఎన్. అశ్వర్థనారాయణ సమావేశమై ఒక పరిష్కార మార్గాన్ని సూచించవచ్చునని అంతా ఆశిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, బృహత్ బెంగుళూరు మహానగర్ పాలిక (బిబిఎంపి) ఛీఫ్ కమిషనర్, బెంగు ళూరు నీటిపారుదలశాఖ అధికారులు, సిటీ పోలీస్ కమిషనర్‌లు కూడా రాష్ట్ర అసెంబ్లీ హాలులో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు తమ సమస్యల గురించి స్వేచ్ఛ గా మాట్లాడవచ్చునని మంత్రి అశ్వర్థనారాయణ ఐటి సంస్థల అధికారులు, ప్రతినిధులకు పిలుపు నిచ్చారు.
బిబిఎంపి ఛీఫ్ కమీషనర్ ఈ చర్చా సమావేశంలో నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు,లోతట్టు ప్రాంతాల్లో, కాలనీల్లోకి వర్షం నీరు చేరుకోవడం, రోడ్లు మీదా నీరు నిలిచి వాహనాలు కదలలేని పరిస్థి తుల గురించిన స్లైడ్ షో ప్రదర్శించి వివరిస్తారు. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగుళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఐటి సంస్థలకు ఉద్యోగులు వెళ్లలేక ఆఖరికి ట్రాక్టర్‌ను ఆశ్రయించే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా సోమవారం భారీ వర్షం నీరు రోడ్లమీద నిలిచి ఎవ్వరినీ కదలనీయలేదు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి బొమ్మై ప్రస్తుత రాష్ట్ర, బెంగుళూరు పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణయాలే కారణమని ఎద్దేవా చేశారు.