ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎటాక్స్
posted on Sep 7, 2022 7:59AM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 40 ప్రాంతాలలో ఈడీ దాడులు నిర్వహించింది. ఒక వైపు సీబీఐ, మరో వైపు ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడ్ పెంచేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.
అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తాన రాజకీయప్రత్యర్థులను వేధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ1గా నమోదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అలాగే ఒక వైపు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ రంగంలోకి దిగడం, ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏకంగా ముఫ్పై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈడీల సోదాలతో ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక హైదరాబాద్ లో అయితే సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉన్న రామచంద్ర పిళ్లై తో పాటు అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నేత పీఏ నివాసంపై కూడా ఈడీ దాడులు చేసినట్లు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది.
సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కేసులో మద్యం లిక్కర్ సిండికేట్ల తరపున డిపాజిట్ కట్టిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఎంపిక చేసిన వ్యక్తులు లక్ష్యంగానే ఈడీ, సీబీఐ దర్యాప్తు జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మోడీ విధానాలను విమర్శించే, వ్యతిరేకించే వారి దూకుడు తగ్గించేందుకే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న విమర్శలకు ఈడీ దాడులు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ కుంభ కోణంలో చాలా మంది ‘పెద్దల’ పేర్లు బయటకు వచ్చినప్పటికీ దాడులు ‘చిన్న’లపైనే జరగడం అనుమానాలకు తావిస్తోందనీ, కేంద్రంపై కేంద్ర దర్యాప్తు సంస్థలను అనుచితంగా ఉపయోగిస్తోందన్న విమర్శలకు బలం చేకూర్చేదిగా ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.