లిల్లీ పుట్ వర్సెస్ చెల్లీపుట్!
posted on Aug 4, 2025 @ 3:47PM
తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్. నేను ఎవరా? నేనెవరో తెలీకుండానే జగదీశ్వర్ రెడ్డి ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నడా? అంటూ నిలదీయడమే కాకుండా.. జగదీశ్ రెడ్డిని లిల్లిపుట్ అంటూ సంబోధించి.. తన అక్కసు మొత్తం తీర్చుకున్నారు కల్వకుంట్ల కవిత.
ఇప్పటికే కాళేశ్వరం మీద సిట్ వేస్తారన్న వార్తలు వినవస్తున్నాయ్. అసెంబ్లీలో చర్చకు ఆస్కారముంది. మూడ్రోజుల పాటు సభ పెట్టి సభ్యులందరికీ నివేదిక ఇచ్చి సిట్ వేయడమా? చర్చలకు ఉపక్రమించడమా? అన్నది తేల్చనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అభిప్రాయం అడిగి తెలుసుకోనున్నారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ జరగనుంది.
ఒకపక్క తండ్రి పరువు ఈ స్థాయిలో పోతుంటే.. తనయ దానిని అడ్డుకోవల్సింది పోయి.. రోజుకో రచ్చ. దీంతో ప్రత్యర్ధులు దించే గునపాలన్నా బలమైన గాయాలు తగులుతున్నాయి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంటున్నారు. ఇంటి మనిషైన కవిత వెనక నుంచి అనుకోని సమయంలో అనుకోని విధంగా దించుతున్న ఈ గునపాల నొప్పి మరింత ఎక్కువగా ఫీలవుతున్నారట అధినేత కేసీఆర్.
ఎవరు అవునన్నా కాదన్నా.. తన తర్వాత అంతటి స్థాయిలో తన కొడుకు కేటీఆర్ ఈ పార్టీకి కాబోయే రాజు ప్రస్తుత యువరాజు. అలాంటి యువరాజు పట్ల కనీసం గౌరవ మర్యాదలు చూపకుండా కవిత పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కి గట్టిగానే తగులుతున్నట్టు సమాచారం. ఒక సమయంలో చంద్రబాబులా తాను కూడా ఒక్కడ్నే కని ఉంటే ఈ గొడవలే లేక పోయేవని ఫీలవుతున్నారట పెద్ద సారు. అంతగా కవిత సూటి పోటి మాటలు ఆయన గుండెల్లో సలుపుతున్నాయట.
ఇంకో సస్పెన్స్ ఏంటంటే వచ్చే రాఖీ పండక్కి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందా కట్టదా? ఇదొక చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కేటీఆర్ కేంద్రంగా అనేక కామెంట్లు చేసి ఉన్నారు. ఈ క్రమంలో అన్నకు చెల్లె రాఖీ కడతదా కట్టదా? అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నట్టు సమాచారం.
ఇక తాజా కబర్ విషయానికి వస్తే తనను కవిత లిల్లీ పుట్ అన్న విషయంపై చర్చించడానికి జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చారు. తన ఉద్యమ ప్రస్తానం గురించి తెలీకుండా పార్టీని జిల్లాలో నాశనం చేశాడంటూ ఆమె తిట్టడంపై కేసీఆర్ తో కలసి చర్చించేలా తెలుస్తోంది.