Read more!

షర్మిల ఎఫెక్ట్.. కడపలో అవినాష్ సీన్ సితారేనా?

వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు.  అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు. రాజకీయ అధికారంలో కానీ, కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో కానీ ఆమెకు తీవ్ర నష్టం కలిగించారు.

అన్న వైఖరితో విభేదించిన షర్మిల చివరికి పొరుగు రాష్ట్రం వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు. అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. వైఎస్ పై అభిమానంతో ఆ రాష్ట్రంలో షర్మిలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా జగన్ వారించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో అటువంటి వారిని షర్మిలకు దూరం చేశారు. పొంగులేటి వంటి వారు షర్మిలకు సహాయం చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనంగా అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  చివరకు ఆమె తెలంగాణ ఎన్నికల బరి నుంచి పార్టీని దూరంగా ఉంచి.. ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. వైసీపీతో ఢీ అంటే డీ అంటున్నారు. 

స్వయంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారం కడప రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అవినాష్ కు నిద్రపట్టకుండా చేస్తోంది. తమ కుటుంబానికి పెట్టని కోటలాంటి కడప జిల్లాలో షర్మిల ప్రభావం వైసీపీకి అడుగడుగునా గండంగా మారింది. కడప ఎంపీగా  గెలిచేందుకు ఆమె సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆమె ప్రచార సరళి, ప్రచార వేగం, మాటల తూటాలూ   వైసీపీ నేతల  మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.  ఎన్నికల ప్రచారంలో ఆమె నేరుగా అవినాష్ రెడ్డి, జగన్ లనే అటాక్ చేస్తున్నారు. ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా  మనుషు పీకలు కోసే వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తారా అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేకా హంతకులను పక్కన పెట్టుకుని ఓట్లడగడానికి ఎలా వస్తున్నావంటూ జగన్ ను నిలదీసి ప్రశ్నిస్తున్నారు.   షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మరీ ముఖ్యంగా మహి ళల నుంచి విశేష  స్పందన వస్తున్నది.  

ఈ స్థాయిలో షర్మిల  ప్రచారానికి ప్రజాస్పందన వస్తున్నదంటే వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. రాష్ట్రంలో  కాంగ్రెస్ కు లీడర్, క్యాడర్ లేరు. ఈ మాత్రంగానైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు వినపడుతోందంటే అందుకు కారణం వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమేనని అంగీకరించి తీరాలి. అటువంటి కాంగ్రెస్ ప్రచార సభలకు కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. షర్మిలకు లోపాయికారిగా వైసీపీ క్యాడర్ సహకారం అందిస్తున్నట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చు కోవడం కూడా  అవినాష్ రెడ్డికి కడపలో బిగ్ మైనస్గా మారిందని చెబుతున్నారు. సీబీఐ చార్జిషీటులో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని.. పబ్లిక్ డోమైన్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. అందుకే  వైఎస్ వివేకా హత్య పై చర్చ కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ విష యాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కడప కోర్టు గ్యాగ్ ఆర్డర్ కారణంగా జరిగింది ఏమైనా ఉందంటే జనం అవినాష్ రెడ్డి వైపు తప్పు ఉంది కనుకనే కోర్టును ఆశ్రయించారు అని జనం చర్చించుకోవడం మాత్రమే.