Read more!

నాలుగు కంటైనర్లు... 2 వేల కోట్ల క్యాష్!

అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. ఆ లారీల మీద వున్నవి పెద్దపెద్ద కంటైనర్లు కాబట్టి లారీలు చాలా మెల్లగా ప్రయాణిస్తున్నాయి. ఈ లారీల ముందు ‘POLICE’ అనే బోర్డు కనిపిస్తోంది.  నాలుగు లారీల్లో చివరి లారీని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ యథాలాపంగా రేర్ వ్యూ మిర్రర్లోంచి చూశాడు.. వెనుక తమ లారీల వైపు దూసుకొస్తున్న పోలీస్ వెహికల్ కనిపించింది. అందులో పదిమందికి పైగా పోలీసులు వున్నారు. పోలీసు వెహికల్ని చూసి లారీ డ్రైవర్ ఎంతమాత్రం భయపడలేదు.. పోలీసు వెహికల్ వేగంగా ముందుకు వచ్చింది. లారీలన్నిటి ముందుకు వెళ్ళి రోడ్డు మధ్యలో సడన్ బ్రేక్‌తో ఆగింది. వెంటనే అందులోంచి పోలీసులు బిలబిలమంటూ కిందకి దిగారు. వస్తున్న లారీలను ఆపాలన్నట్టు సైగ చేశారు. కొందరు సిన్సియర్ పోలీసులయితే ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా రివాల్వర్స్ తీసి లారీలకు ఎయిమ్ చేసి నిల్చున్నారు.

పోలీసుల దగ్గరకు వచ్చిన లారీలు ఆగాయి. సాధారణంగా లారీ డ్రైవర్లు అంతమంది పోలీసులను చూస్తే కిందకి దిగి నమస్తే సార్ అంటారు. కానీ ఈ నాలుగు కంటైనర్లను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లు ‘పోలీసులా.. అయితే ఏందంట’ అన్నట్టుగా డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని వున్నారు. పోలీసులు వాళ్ళని కిందకి దించారు. కంటైనర్లలో ఏముందో చెక్ చేసి షాకయ్యారు.. ఆ నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల రూపాయల క్యాష్ వుంది. పోలీసులకు అప్పుడెప్పుడో విడుదలైన మణిరత్నం సినిమా ‘దొంగ.. దొంగ’లో వున్న క్యాష్ కంటైనర్ గుర్తొచ్చింది. దాంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పై అధికారులకు సమాచారం అందించారు. నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ వుంది కదా.. ఆ రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ మరేదో కాదు.. రద్దయిన 5 వందల నోట్లు.. లారీలో వున్న వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆ కంటైనర్లు మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి చెందినవి. నోట్ల రద్దు సందర్భంగా కేరళలో కలెక్ట్ చేసిన 5 వందల రూపాయల నోట్లను హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. అంతే.. అంతకంటే పెద్ద మేటరేం లేదు. భలే కేసు పట్టుకున్నామని అప్పటి వరకు మురిసిపోయిన ఏపీ పోలీసులు నిట్టూర్చారు. ఆర్బీఐ అధికారుల నుంచి కన్ఫర్మేషన్‌ తీసుకుని కంటైనర్లని వదిలేశారు.