రైతులకు మద్దతుగా పోలీసు స్టేషన్ వద్ద అవినాష్ రెడ్డి ధర్నా
posted on Nov 8, 2025 @ 8:15PM
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో విపరీతంగా, విచ్చల విడిగా రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్ల కేబుల్స్ చోరీకి గురవుతన్నాయని, వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగాల పోలీసు స్టేషన్ ఎదుట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి బైఠాయించారు.
లింగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్లను దొంగలించడంతో రైతులందరూ ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డినికలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి రైతులతో లింగాల ఎస్.ఐ అనిల్ కుమార్ ను కలసి ఇటీవల రైతుల కేబుల్ వైర్లు దొంగతనాల పై చర్చించారు. అలాగే ఈ దొంగతనాల పై షెల్కే నచికేతన్ విశ్వనాథ్ తో కూడ ఫోన్ లో మాట్లాడారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించి రికవరీ చేయించాలని కోరారు.
అనంతరం ఎం.పి రైతులతో కలసి లింగాల పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేయడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నిన్న రాత్రి ఒక్క రోజే 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ చోరీకి గురయ్యాయన్నారు. రైతుల కేబుల్స్ దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
కొమ్మనూతల గ్రామానికి చెందిన పురుషోత్తమరెడ్డి భార్యకు సంబంధించి 1000 మీటర్ల కేసుబ్ చోరీ గురి కావడంతో రూ.2.5 లక్షలు నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని ఎస్.ఐ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో రికవరీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రికవరీ విషయంలో శ్రద్ధ చూపాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం అరటి పంట కు టన్ను రూ.4 వేలు, 5 వేలు అడుగు తుండడంతో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు.
దీనికి తోడు దొంగలు ఇష్టానుసారంగా రైతుల కేబుల్ వైర్లను తస్కరించడంతో రైతుల బాధ వర్ణణాతీతమన్నారు. వీలైనంత త్వరగా కేబుల్ వైర్ల దొంగలను పట్టుకుని వైర్లు రికవరీ చేయాలని, అలాగే కేబుల్ వైర్ లోని రాగి వైరు కొన్న వారిని కూడ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు.
కేబుల్ వైర్లు పోయిన రైతులకు నష్టపరిహారం కూడ అందేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.సాగుచేసిన పంటలకుగిట్టు బాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతుంటే నేడు మోటార్ కేబుల్స్ చోరీకి పాల్పడు తుండండతో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు. తప్పుడు పనులు చేసే వారు మానుకోవాలని, రైతుల పొట్ట కొట్ట వద్దని ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి కోరారు.