Read more!

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. 
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం  తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే, నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు. 

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.