Read more!

సంప్రదాయబద్ధంగా జరిగిందే పెళ్ళి!!

‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని, ఏ హిందూ జంటకి అయినా ‘పెళ్ళి అయింది’ అని గుర్తించాలంటే వాళ్ళిద్దరికీ జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు, ఏడడుగులు లాంటి సంప్రదాయాలను పాటిస్తూ పెళ్ళి జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడెప్పుడో మేమిద్దరం మాకు తోచినట్టు పెళ్ళి చేసుకున్నాం, మేమిద్దరం ఇప్పుడు తన్నుకు చస్తున్నాం. మాకు విడాకులు ఇచ్చేయండి’ అని ఓ జంట సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వీరి వివాహం జరిగిన పద్ధతి గురించి తెలుసుకున్న సుప్రీం కోర్టు.. అసలు మీకు జరిగింది పెళ్ళే కాదు.. ఇక విడాకులు ఇవ్వడం ఏమిటి? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ ఆ దంపతుల పెళ్లి చెల్లదని తీర్పు వెలువరించింది. ఆ కేసుని డిస్మిస్ చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు పాటించకుండా జరిగే హిందూ వివాహం చెల్లదు అని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. 

‘హిందూ ధర్మంలో వున్న అనేక సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. దానికి పవిత్రత ఉంది. భారతీయ సమాజంలో దానికి ఆ గౌరవం, హోదా ఇవ్వాల్సిందే’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

‘పెళ్ళి అంటే ఆటపాటల కార్యక్రమమో, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకొనే వాణిజ్య లావాదేవీనో కాదు. హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉంది. దానికి ఆ హోదా ఇవ్వాల్సిందే. హిందూ ధర్మ పద్ధతి ప్రకారం పెళ్లి తంతు లేకుండా ఒక్కటైన దంపతులు నిజానికి దంపతులే కాదు.. చట్టం వారిని దంపతులుగా గుర్తించదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం పెళ్లిలో కచ్చితంగా సంప్రదాయ ఆచారాలు, క్రతువులను నిర్వహించాల్సిందే.  అలాంటి ఆచార పద్ధతులను నిర్వహించకుండా జరిగిన పెళ్ళిని రిజిస్టర్ చేసినా అది చట్టబద్ధంగా చెల్లదు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.