జూబ్లీ ఉప ఎన్నిక చుట్టూ పరిభ్రమిస్తున్న తెలంగాణ రాజకీయం!
posted on Sep 19, 2025 @ 9:57AM
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానమేంటో తేలిపోనున్నదా? మంత్రి పొంగులేటి కామెంట్ల అర్ధమేంటి? వచ్చే మూడున్నరేళ్లలో అసలు పార్టీయే ఉండదనీ.. బీజేపీలో కలిపేసి.. విదేశాలకు వెళ్లినా వెళ్తారనీ కామెంట్ చేశారు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి. ఈ సరికే కేటీఆర్ పెట్టేబేడా సర్దుకుని పేకప్ చెప్ప డానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్య చేశారు. పొంగులేటి మాటలను అటుంచితే.. అధికార ప్రతిపక్షాల మధ్య జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మాత్రం మహా రంజుగా సాగేలా కనిపిస్తోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఉన్న రసవత్తర పోరుకు తోడు ఇటు కవిత జాగృతి తరఫున అభ్యర్ధి బరిలోకి దిగేలా తెలుస్తోంది. అలాగే ఎన్డీయే కూటమి అభ్యర్థి కూడా పోరులో ఉండటం తథ్యం. అంటే ఎటు నుంచి ఎటు చూసినా గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై అన్ని పార్టీలూ దృష్టి పెట్టారన్నది స్పష్టమౌతోంది.
అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సినీ ప్రముఖులు, సినీమా పరిశ్రమకు చెందిన వారు అధికంగా ఉండే ప్రాంతం. ఒక సమయంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగుతారని కూడా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సతీమణి శైలిమను బరిలోకి దింపినా దింపుతారనే మాట కూడా గట్టిగా వినిపించింది. శైలిమగానీ బరిలోకి దిగితే.. జాగృతి అధ్యక్షురాలు కవిత తన వదినపై పోటీ చేస్తారన్న టాకూ వచ్చింది.
అదలా ఉంటే ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాకు ఆమోదం లభించలేదు. ఒక వేళ ఆమె రాజీనామాను మండలి చైర్మన్ఆమోదిస్తే.. అప్పుడు కవిత అనివార్యంగా ఏదో ఒక పదవి కోసం పోటీ పడాల్సి ఉంది. ఇటు సోదరితో పాటు అటు సోదరుడికి కూడా ఈ సీటు సో- సో- సో ఇంపార్టెంట్. ఎందుకంటే అధికార పక్షం, పొంగులేటి వంటి వారి రూపంలో ఎప్పుడూ ఏదో ఒ పరీక్ష ఎదురవుతూనే ఉంది. ఈ అవమానాలన్నిటి నుంచి బయట పడాలంటే కేటీర్ సైతం ఇక్కడ తన సత్తా చాటాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పార్టీకి భవిష్యత్ అధినేతగా కేటీఆర్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పరీక్ష అనే చెప్పాలి. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటితేనే.. ఆయన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది. తన సత్తా చాటాల్సి ఉంటుంది.
వీటన్నిటితో పాటు.. కాంగ్రెస్ కి కూడా జూబ్లీ ఉప పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకం అనడంలో సందేహం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికలో గెలవకుంటే అది ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి దోహదపడుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ కవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది.