జూబ్లీ తెరపైకి ..మరో మాగంటి
posted on Jun 29, 2025 @ 11:09AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. సిట్టింగ్ బీర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైన జూబ్లీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, ఇప్పటికే, ఉప ఎన్నిక రూట్లో కంటోన్మెంట్ సీటును తమ ఖాతాలో వేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, జూబ్లీలోనూ బీఆర్‌ఎస్’ను ఓడించి, సిటీలో మరో సీటును తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. మరో వంక, బీజేపీ ఫ్యూచర్ వ్యూహాలకు పునాదులు వేసుకునే ప్రయత్నంలో భాగంగా, ఏపీలో సక్సెస్ అయిన, కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో రీప్లే చేసేందుకు జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని ప్రయోగశాల చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గలో గెలుపు ఓటములను నిర్ణయించడంలో, ఒక లక్షా 23 వేల వరకు ఉన్న ముస్లిం ఓటు, 70 వేలకు పైగా ఉన్న సెటిలర్స్’ ఓటు కీలకం కాగా, పార్టీలు, పొత్తులు, అంతకు మించి అభ్యర్ధుల ఎంపిక గెలుపు ఓటములను నిర్ణయించడంలో మరింత కీలకం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే, ప్రధాన పార్టీలు, ఓ వంక పొత్తులు, లోపాయికారీ ఒప్పందాలపై కసరత్తు చేస్తూనే, మరో వంక అభ్యర్ధుల, ‘లెక్కలు’ తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
పొత్తుల విషయానికివస్తే,కాంగ్రెస్ పార్టీ లక్షకు పైగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని,ముస్లిం అభ్యర్ధిని బరిలో దింపి ఎంఐఎంతో లోపాయికారీ, ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో, బీఆర్ఎస్’ ఇదే ప్రయోగం (ఎంఐఎం లోపాయి కారీ ఒప్పందం) చేసి, విజయం సాదించిన నేపధ్యంలో కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ బాటలో నడవాలనే ఆలోచన చేస్తున్నట్లు చెపుతున్నారు. గత (2023)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్’ను బరిలో దింపింది, అయినా, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్’ 16 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.ఎంఐఎం అభ్యర్ధికి 7,848 ఓట్లు మాత్రమే వచ్చాయి.అంటే, ముస్లిం ఓటును ఎంఐఎం సక్సెస్ఫుల్’ గా బీఆర్ఎస్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ వార్ రూమ్’లో పాత ఫలితాలను ముందేసుకుని, కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెసుస్తోంది.
అలాగే, పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ టికెట్ తనకే దక్కుతుందని ధీమాను వ్యక్తం చేశారు. అయితే, పార్టీ నాయకత్వం గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు.
మరోవంక,బీఆర్ఎస్’ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో చేతులు ఎత్తేసిన హస్తం పార్టీ మోసాలతో పాటుగా, వరసగా మూడు సార్లు గెలిచిన ‘మాగంటి’ గోపీనాథ్’ ఇంటి పేరునే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో దించాలని, అనుకున్నా,ఆమె అంత సుముఖమ లేరని అంటున్నారు.
ఈ నేపధ్యంలో, గులాబీ పార్టీ,మాగంటి గోపీనాథ్ సోదరుడు, మాగంటి వజ్రనాథ్’ను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.నిజానికి, ‘మాగంటి’ రాజకీయ,వ్యాపార విజయాలలో గోపీనాథ్ తెరమీద హీరో అయితే, తెర వెనక హీరో,’వజ్రనాథ్’, అంటూ బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే, మాగంటి సోదరులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ 90 ఏళ్ళు పైబడిన, తల్లి మహానంద దేవి’ మాట జవదాటరని, అంటున్నారు.
మరోవంక బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్’ కు గోపీనాథ్’కు ఎంత గుర్తింపు గౌరవం వుందో, వజ్రనాథ్’కు అంతే గుర్తింపు గౌరవం,ఉన్నాయని, అలాగే,వరసగ మూడు ఎన్నికల్లో సోదరుడి ఎన్నిల బాధ్యతను బుజానికి ఎత్తుకుని విజయవంతంగా పూర్తి చేసిన వజ్రనాథ్’కు నియోజక వర్గం, ఎత్తుపల్లాలు అన్నీ కొట్టిన పిండని, బీఆర్ఎస్ వర్గాలు వజ్రనాథ్’ ను తెరపైకి తెచ్చేప్రయత్నం చేస్తున్నాయి. సో .. గులాబీ బాస్’మరో, ‘మాగంటిని’ బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు చెపుతునన్నారు. అయితే, పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సహా మరికొందరు, టికెట్ ఆశిస్తున్న నేపధ్యంలో, గులాబీ బాస్’ ఇంతవరకు ఎవరి విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ఓ వంక అధిఅక్ర కాంగ్రెస్, మరో వంక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోందని, అంటున్నారు.