తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే... తెలుగు జాతికి పురోగతి : సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం తన లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
తెలుగు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి మాతృభాషగా ఉందని, టెక్నాలజీ సహాయంతో భాషను మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ నుంచి ఆధునిక కవులు వరకు తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులను స్మరించుకున్నారు. తెలుగు భాషే మన అస్తిత్వం, ఐక్యతే మన బలం అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు... ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు.
తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ... జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు చేసిన సేవను మరిచిపోలేం. సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం. ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస - యాస, మన సంధులు - సమాసాలు, మన సామెతలు – పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు.
నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఆనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.