ఈ భేటీ వెనుక ఏదో ప్లానుంది!
posted on Jul 29, 2024 @ 9:41PM
సోమవారం ఒక వార్త మీడియాలో గుప్పుమంది. అదే, వైఎస్ విజయమ్మ, జేసీ ప్రభాకరరెడ్డి భేటీ వార్త. జగన్‌కి బద్ధ శత్రువైన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ భేటీ అయ్యారంటే ఏదో ప్రత్యేకమైన రాజకీయ కారణం వుందన్న అభిప్రాయం అందర్లోనూ కలిగింది. చాలా కీలకమైన ఈ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించింది. ఈ వార్తలు చూసి వైసీపీ వర్గాల గుండెలు గుభేల్ అన్నాయి. ఎన్నికల జరిగినప్పుడు జగన్‌కి వ్యతిరేకంగా వీడియో మెసేజ్ రాష్ట్ర ప్రజలకు పంపిన విజయమ్మ, జగన్ ఓటమికి ఒక కారణంగా నిలిచారు. ఇప్పటికే జగన్ సర్వనాశనం అయిపో్యాడు.. ఇప్పుడు ఇంకా నాశనం చేయడానికి విజయమ్మ జేసీతో భేటీ అయిందేమోనన్న అభిప్రాయాలు వినిపించాయి.
అయితే, ఆ తర్వాత జేసీ ప్రభాకరరెడ్డి నుంచి వివరణ వెలువడింది. ‘‘నేను విజయమ్మతో రాజకీయ కారణాలతో భేటీ కాలేదు. నేను హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి వెళ్ళాను. అక్కడ విజయమ్మ కూడా వున్నారని తెలిసింది. ఆమెతో నేను లాంజ్‌లో కూర్చుని మాట్లాడాను అంతే.. అంతకంటే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు’’ అనే సారాంశం వచ్చేలా ఆయన వివరణ ఇచ్చారు. దాంతో ఈ ఇష్యూ సర్దుమణిగింది. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నామే అని మీడియా అనుకుంటే, అనవసరంగ భయపడి చచ్చాం అని వైసీపీ వర్గాలు అనుకున్నాయి.
కానీ, ఈ భేటీ అంత లైట్‌గా తీసుకోవాల్సిన భేటీ అని మాత్రం అనిపించడం లేదు. ఏదో ఆస్పత్రిలో కాకతాళీయంగా కనిపించినప్పటికీ జగన్‌కి శత్రువు అయిన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ ఎందుకు భేటీ అవ్వాలి? అలా భేటీ అయితే అసలే అనుమానపు పక్షి అయిన జగన్, షర్మిల మీద పీకల వరకూ కోపంగా వున్న జగన్ ఈ భేటీని రాజకీయ కోణంలో ఆలోచిస్తాడేమోనని విజయమ్మ అనుకోలేదా? సరే, కాసేపు అసలు ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదనే అనుకుందాం. ఆయన నమస్కారం విజయమ్మగారూ అంటే, ఈవిడ నమస్తే రెడ్డిగారూ అంటే సరిపోతుంది కదా... అక్కడితో ఇష్యూ క్లోజ్ అయ్యేది కదా! మరి, వీళ్ళిద్దరి భేటీ ఫొటో తీసిందెవరు? దాన్ని మీడియాకి రిలీజ్ చేసిందెవరు? వాళ్ళ ప్రమేయం లేకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే ఫొటో తీశారా? కాబట్టి, ఈ భేటీలో ఏదో రాజకీయ ప్రాధాన్యం వుంది.. అదేంటో ఇప్పటికిప్పుడే తెలియకపోవచ్చుగానీ, అతి త్వరలోనే బయటపడే అవకాశాలు అయితే వున్నాయి!