మా వాడు హైకోర్టునే పీకి పారేశాడు.. జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు
posted on May 21, 2020 @ 2:41PM
'మా వాడు.. మా వాడు' అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బాగా అలవాటు. తాజాగా ఆయన మరోసారి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. వాళ్లదే రాజ్యమని అన్నారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు పట్టించుకోవడం లేదని... హైకోర్టునే పీకి పారేశాడని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని.. కనీసం మీ సమస్య ఏంటని కూడా అడగడం లేదని విమర్శించారు.
మా టీడీపీ నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నిజంగా నిరాహార దీక్ష చేసినా ప్రజలు నమ్మరు.. బిర్యానీ తిని చేస్తున్నారనుకుంటారు అన్నారు. దీక్షలు చేసినంత మాత్రాన జగన్ లో మార్పు రాదని చెప్పారు. రాష్ట్రంలోని సగం జనాలు ఆయన ఇంటి ముందు కూర్చుంటే జగన్ వింటాడేమో అని జేసీ అన్నారు. అయితే, పోతిరెడ్డి పాడు విషయంలో మాత్రం మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడు అనిపిస్తోంది అని జేసీ వ్యాఖ్యానించారు.