ఆగస్టులో భారత్ లోని ఆరు నగరాలకు కువైట్ ఫ్లైట్స్
posted on Jul 22, 2020 @ 10:58AM
బుకింగ్ ప్రారంభించిన జజీరా, కువైట్ ఎయిర్ లైన్స్
విమానాశ్రయంలో పాటించవలసిన జాగ్రత్తలు
కోవిద్ 19 వైరస్ కారణంగా ప్రపంచదేశాల్లో విమానప్రయాణాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాతే తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీస్ లు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కువైట్ భారత్ లోని కొన్ని ప్రధాన నగరాలకు బుకింగ్ ప్రారంభించింది. అహ్మాదాబాద్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కొచ్చిన్ నగరాలకు కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ బుకింగ్ ప్రారంభించింది. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కొచ్చిన్ నగరాలకు
కువైట్ ఎయిర్ వేస్ బుకింగ్ ప్రారంభించింది. ఈ నేపధ్యంలో విమానాశ్రయంలో పాటించాల్సిన జాగ్రత్తలను కువైట్ విమానాశ్రయ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సలేహ్ అల్-ఫదాగి వివరించారు.
ప్రయాణీకులతో పాటు వారు తీసుకువచ్చే లగేజీ మొత్తం చెక్ ఇన్ లోనే అనుమతిస్తారు. క్యాబిన్ లోకి హ్యాండ్ లగేజీని అనుమతించరు. పిల్లలు, పెద్దవారి అవసరాలకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులను మాత్రమే క్యాబిన్ లోని అనుమతిస్తారు. విమానాశ్రయాల్లోకి కేవలం ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. వారితో పాటు మరెవ్వరిని రానవ్వరు.
విమాశ్రయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. వృద్ధులకు మరోవ్యక్తి సహాయం అవసరం కావల్సి వచ్చినప్పుడు వారు ఆ విషయాన్ని టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే చెప్పాలి. టికెట్ బుకింగ్ కూడా ఆన్ లైన్లోనే చేసుకోవాలి. నాలుగు గంటల ముందుగానే విమానాశ్రయంలో ఉండాలి.