ఇష్టారాజ్యంగా భూ పందేరం
posted on Mar 29, 2011 @ 3:52PM
హైదరాబాద్: ప్రభుత్వ భూములను తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఇష్టం వచ్చినట్లు పందేరం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. భూకేటాయింపులపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని, వివిధ సంస్థలకు చెందిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికపై కోట్లాది రూపాయల విలువ చేసే గనులను అప్పన్నంగా కట్టబెట్టారని, అలా కట్టబెట్టినందుకు ఆయా సంస్థల్లో ప్రభుత్వాధినేత తనయుడికి యాభై శాతం వాటా దక్కిందని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఆయన మంగళవారం ప్రసంగిస్తూ భూముల కేటాయింపు వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి ఉందని ఆదాయం పన్ను శాఖ గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవడం జాప్యం వద్దని ఆయన అన్నారు. బహిరంగ వేలంలోనే భూములను వివిధ సంస్థలకు అప్పగించాలని ఆయన కోరారు. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అవినీతులతో పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన అన్నారు. భూ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని ఆయన అన్నారు. భూతద్దం పెట్టినా కనిపించని దేశానికి చెందిన రస్ ఆల్‌ఖైమా కంపెనీతో ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్‌కు అప్పన్నంగా పది కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 2010 వరకు 320 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీలో రస్ ఆల్‌ఖైమా సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు. కాకినాడ కంపెనీతో ఓఎన్‌జిసి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రంపై ప్రైవేట్ వ్యక్తి సంతకం చేశారని ఆయన చెప్పారు. ఒప్పందాలు ఎలా జరుగుతాయో, ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా ఒప్పందాలు జరిగాయని ఆయన అన్నారు. రైతులను బెదిరించి కాకినాడ సీపోర్టు రైతుల నుంచి భూములను సేకరించిందని ఆయన విమర్శించారు.