జయ వెడలె కుర్చీ వెంటరాగ...
posted on Jun 4, 2014 @ 4:06PM
ఇంతవరకు జనాలకి రాజు వెడలె రవి తేజములరియగా...కుడి ఎడమల్ దాల్ కత్తుల మెరియగా అనే పాత పద్యం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కత్తులు, బల్లేలు వెంట తెచ్చుకోవడం అనాగరికంగా ఉంటుంది గనుక మన జయమ్మ..అంటే తమిళనాడు ముఖ్యమంత్రి తన కుర్చీ వెంటబెట్టుకొని డిల్లీ వెళ్ళారు.
గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తన చెప్పులను తెప్పించుకొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మన జయమ్మ వంతు. ఆమె నిన్న ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసేందుకు డిల్లీ వచ్చినప్పుడు, తను నిత్యం వాడే ఒక కుర్చీను కూడా తన వెంట తీసుకువెళ్ళారు. ప్రధానిని, ఆర్ధికమంత్రిని కలిసినప్పుడు ఆమె వారి కార్యాలయం ఉండే కుర్చీలో కూర్చోకుండా, తను వెంట తెచ్చుకొన్న కుర్చీని వేయించుకొని అందులో కూర్చొని వారితో సమావేశమయ్యారు. వారి సమావేశం ముగిసిన తరువాత, ఆమె సిబ్బంది ఆ కుర్చీని మళ్ళీ వెంట తీసుకుపోయారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలిస్తున్న ఆమె ఈవిధంగా ప్రవర్తించడం చూసి జనాలు ముక్కున వేలేసుకొన్నారు.
అయితే ఆమెకు ఆ కుర్చీలో కూర్చొంటే అంతా మంచే జరుగుతుందనే సెంటిమెంటు ఉందని కొందరు, కాదు..ఆమెకు నడుం నొప్పి ఉన్నందున ఆమె ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న కుర్చీ వెంటబెట్టుకొని తిరగవలసి వస్తోందని ఆమె అభిమానులు.. ఇలా రకరకాల కుర్చీ కబుర్లు వినబడుతున్నాయి. అదేమీ కాదు..ఆమె తన కుర్చీని చెన్నైలో వదిలిపెట్టి డిల్లీ వెళితే, అందులో ఆ పెద్దాయన కరుణానిధి ఎక్కడ సెటిల్ అయిపోతారో అనే భయంతోనే ఆమె తన కుర్చీని వెంటమోసుకొని తిరుగుతున్నారని గిట్టని వాళ్ళు ఒకటే ఇకఇకలు, పకపకలు. ఇంతకీ ఆమె ఆ కుర్చీలో కూర్చొని డిల్లీలో ఏమి సాధించేరో ఇంకా తెలియవలసి ఉంది.