ఆ పాప ప్రాణం ఖరీదు 20 రూపాయలు!
posted on Jun 4, 2014 @ 5:11PM
అన్నెం పున్నెం ఎరుగని ఏడేళ్ళ పసిపాప 20 రూపాయల కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది. 20 రూపాయలు ఆమె దారుణ హత్యకి గురవడానికి కారణమయ్యాయి. అత్యంత విషాదకరమైన సంఘటన ముంబైలోని చెంబూరు ప్రాంతంలో జరిగింది. ప్రకాష్ హజ్రా అనే వ్యక్తి తన పక్కింట్లోకి సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాడు. అక్కడ ఆ ఇంటి యజమాని సర్కార్‌కి సంబంధించిన పర్స్ అతనికి కనిపించింది. ఆ పర్సు చూడగానే హజ్రాలో దొంగ బుద్ధి ప్రవేశించింది. ఆ పర్సులో వున్న 20 రూపాయలను కాజేసి ఏమీ ఎరుగనట్టుగా పర్సు అక్కడే పెట్టేశాడు. అయితే హజ్రా తన తండ్రి పర్సులోంచి 20 రూపాయలు దొంగతనం చేయడాన్ని అక్కడే ఓ పక్కన ఆడుకుంటున్న ఏడేళ్ళ వయసున్న బ్యూటీ సర్కార్ చూసింది. అంతే హజ్రాలోని రాక్షసుడు నిద్రలేచాడు. తాను చేసిన దొంగతనం గురించి ఆ పాప ఇంట్లో చెప్పేస్తే తన పరువు పోతుందని అనుకున్న హజ్రా బ్యూటీ సర్కార్ తలని అక్కడే వున్న నీటి తొట్టెలో ముంచేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.