జయకే తమిళుల పట్టం?
posted on Mar 30, 2011 @ 11:16AM
చెన్నై: త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తమిళ ఓటర్లు పురుచ్చి తలైవి జయలలితకే పట్టం గట్టనున్నారు. ఓ సంస్థ చేసిన సర్వేలో జయలలితకే తమిళులు పట్టం గట్టనున్నట్లుగా తేలినట్లు తెలుస్తోంది. జయలలిత సారథ్యంలోని ఏఐఏడిఎంకె కూటమి ఈ ఎన్నికలలో 114 నుండి 117 సీట్ల వరకు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడయింది. జయ సీట్లను పెంచుకున్నప్పటికీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేదని తెలుస్తోంది. 235 శాసనసభ స్థానాలు ఉన్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. కాగా జయకు ఒకటి నుండి నాలుగు సీట్ల వరకు తగ్గవచ్చని తెలుస్తోంది. ఒకటి, రెండు సీట్లు తగ్గినప్పటికీ ఇతరుల అండతో జయ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కరుణానిధి సారథ్యంలోని డిఎంకె ఈసారి అధికారాన్ని కోల్పోతుందని ఆ సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. డిఎంకెకు ఈ ఎన్నికల్లో 84 నుండి 88 సీట్ల వరకు దక్కవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఏ పార్టీ ఓటింగ్ శాతం ఆ పార్టీకి దాదాపుగా ఉంటుందని తెలుస్తోంది. జయకు 47 శాతం, కరుణానిధికి 46 శాతం ఓటింగ్ ఉంటుందని సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఒక్క శాతం కారణంగానే డిఎంకె అధికారానికి ఈసారి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పొత్తులో భాగంగా అన్నాడిఎంకే 160 సీట్లలోనే పోటీ చేస్తుంది. 2జి స్పెక్ట్రం కుంభకోణం బయటపడిన తర్వాత డిఎంకెపై అక్కడి విద్యావంతులకు నమ్మకం పోయినట్లుగా తెలుస్తోంది.