తెలుగు వెలుగును చాటిన జస్టిస్ జయ బాడిగ!

శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన అచ్చ తెలుగు మహిళ జయ బాడిగ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ సందర్భంగా తెలుగు వెలుగును చాటారు. ప్రమాణ స్వీకారం  చేస్తున్న సమయంలో ఆమె తెలుగులో మాట్లాడారు. తన మాతృభాష తెలుగు మీద వున్న తన అభిమానాన్ని చాటారు. ప్రమాణ స్వీకార ప్రసంగాన్నిప్రారంభిస్తూ ఆమె ‘‘గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవరీవన్... మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం’’ అన్నారు. ఈ  గొప్ప సందర్భంలో తన మాతృభాషలో మాట్లాడ్డం తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని ఆమె చెప్పారు. ఇలాంటి సందర్భాలలో తెలుగును మాట్లాడ్డం మొదటిసారి ఆమె అన్నారు. ఈ సందర్భంగా ‘‘మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి శాంతి శాంతిః’’ అనే సంస్కృత శ్లోకాన్ని కూడా జయ బాడిగ ఉటంకించారు. అమెరికాలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా అక్కడ తెలుగు వెలుగును ప్రసరింపజేసిన జయ బాడిగకు అభినందనలు.

జయ బాడిగ మరెవరో కాదు.. మచిలీపట్నం  పార్లమెంట్ మాజీసభ్యుడు బాడిగ రామకృష్ణ కుమార్తె. జయ బాడిగ తల్లి పేరు బాడిగ ప్రేమలత. బాడిగ రామకృష్ణ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. వారిలో ఒకరు జయ బాడిగ.

ఆమధ్య న్యూజిలాండ్ పార్లమెంట్‌కి ఎంపీగా ఎంపికైన ఒక గిరిజన జాతికి చెందిన మహిళ పార్లమెంటులో తన జాతికి సంబంధించిన భాషను, వారి నినాదాన్ని చెప్పడం ప్రపంచమంతా వైరల్ అయింది. ఇప్పుడు జయ శాంటాక్లారా కోర్టులో తెలుగులో చేసిన ప్రసంగం ఆ పార్లమెంట్ సభ్యురాలు చేసిన ప్రసంగంలా వైరల్ అవుతుందో లేదోగానీ, ప్రతి తెలుగు హృదయంలో వైరల్ అవుతుంది.

Teluguone gnews banner