రెడ్డిగారి ఈ దూకుడు ఎందుకో
posted on Nov 14, 2013 @ 9:47AM
టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో అకస్మాత్తుగా దూకిన జైపాల్ రెడ్డి మొన్ననిర్మల్ లో జరిగిన సభలో ‘సమన్యాయం అంటే అదేమయినా బ్రహ్మపదార్ధమా?’ అని ఒక మంచి ప్రశ్నవేసారు. నిజమే! అది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధమేమి కాదని, దాని భావమెంటో అందరికీ తెలుసునని ఆయనకి బాగా తెలుసును.
అయితే, మిగిలిన కేంద్ర మంత్రులకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు లేని అభ్యంతరం కేవలం తనకే ఉందని భావిస్తూ, ఇంతకాలం తెలంగాణాపై మాట్లాడానికి ఇష్టపడని ఆయన, పాపం టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసుకొని ముఖ్యమంత్రి సంపాదించుకోవాలనే ఆలోచనతో జైత్ర యాత్రలు చేసుకొంటుంటే, వారి మధ్యలో ఆయన సినిమా హీరోలా హటాత్తుగా ఎందుకు దూకారు? దూకి వారి కంటే బిగ్గరగా ‘సోనియమ్మ మనసు వెన్న, కానీ ఆమె సంకల్పం మాత్రం వజ్ర సంకల్పం’ అంటూ ఎందుకు భజన మొదలుపెట్టారు? భద్రాచలం మొదలు హైదరాబాదు వరకు, ఉద్యోగుల సమస్యల నుండి నదీ జలాల వరకు ప్రతీ అంశంపై అందరి కంటే పెద్ద గొంతుకు వేసుకొని ఎందుకు వాదిస్తున్నారు? ఆయనలో కలిగిన ఈ అకస్మాత్ మార్పుల వెనుక దాగిఉన్న బ్రహ్మ రహస్యం ఏమిటి? అని ఆయన వివరించితే బాగుంటుంది.
వీలయితే అవే సభల్లో తను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక చిన్న ప్రకటన చేసినట్లయితే, వేదిక మీద ఉన్న పోటీదారులకి అదో తుత్తి.