టీ కాంగ్రెస్ లో మరో తుపాను.. జగ్గారెడ్డి దారెటు?
posted on Sep 25, 2021 @ 11:39AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్రంలో పార్టీని అధికార తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి ఇంకా రెండు నెలలు అయినా పూర్తి కాలేదు. అయినా ఇంతలోనే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం పెంచారు. క్యాడర్ లో జోష్ పెరిగింది. ప్రజల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయనే భావన ఏర్పడింది. అయితే అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా, అంటే. లేదు. రేవంత్ రెడ్డి దూకుడుకు, సేనియర్ల రూపంలో స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయి. పార్టీ సేనియర్ల నుంచి ఆయన సమస్యలు, సవాళ్ళు ఎదుర్కుంటున్నారు. దీంతో, కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి వస్తోందా, అనే అనుమానాలు కూడా ఇంతలోనే మొదలయ్యాయి.
ఇది కాంగ్రెస్ సంస్కృతిలో భాగమే. పీతల సంఘం , కప్పేల తక్కెడ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదనే అభిప్రాయం కూడా ఉంది. రేవంత్ రెడ్డి పార్టీకి కొత్తే అయినా,కాంగ్రెస్ సంస్కృతి తెలియంది కాదు. అయినా పార్టీ హైకమాండ్, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసాతో సీయర్లకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లు సహకరించిన, సహకరించక పోయినా, అయన తన పంధాలో తాను ముందుకు సాగుతున్నారు. ఈ నేపద్యంలోనే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పదే పదే పైకొస్తున్నాయి. ఓ వంక కోమటిరెడ్డి సోదరలు ఓపెన్ గా ఫైర్ అవుతుంటే, ఇతర సేనియర్ నాయకులు మౌనంగా ఉంటూనే, రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భగ్గుమన్నారు.రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే, పార్టీ మనుగడ కష్టమని అన్నారు. అలాగే, జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుల మీద కూడా, ‘ చెంచాగాళ్లు’ అంటూ విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే హీరో.. మిగతావాళ్లంతా కోవర్టులు అన్నట్లుగా రేవంత్ చెంచాగాళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జహీరాబాద్;లో పర్యటించడం కూడా జగ్గారెడ్డికి కోపం తెప్పించింది.
అదే సమయంలో జగ్గ్గారెడ్డి తాను తెరాసలోకి పొతే అడ్డుకునేది ఎవరని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా 19మందిలో 12 మంది పార్టీ ఫిరాయించడం పార్టీ ప్రతిష్టను గట్టిగా దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థిలో ముఖ్యంగా మరో ముఖ్య నేత కూడా అదే బాటలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో, పీసీసీ పదవికి పోటీపడి, వర్కింగ్ ప్రెసిడెంట్’గా బాధ్యతలు నిర్వహిస్తున్న జగ్గారెడ్డి తెరాస తీర్ధం పుచ్చుకుంటే, కాంగ్రెస్ పార్టీని మరింతగ డెబ్బ తీస్తుందని అంటున్నారు. అయితే జగ్గా రెడ్డి తానూ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, ప్రతిలో కొనసాగుతూనే పోరాటం సాగిస్తానని అన్నారు. అయినా జాతీయ స్థాయిలో ముఖ్యంగా పంజాబ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో పాట నీరు కొట్టుకుపోయియా కొత్త నీరు వచ్చి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోనూ అదే జరుగుతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, రేవంత్ రెడ్డి సారధ్యంలోనే పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.