కరోనా ముప్పు ఇంకా ఉందా? థర్డ్ వేవ్ వస్తుందా.. రాదా?
posted on Sep 25, 2021 @ 12:22PM
దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువన నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం (సెప్టెంబర్ 25) న విడుదల చేసిన తాజా గణాంకాలను గమనిస్తే, రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. అయినా దేశంలో రికవరీ రేటు 97 శాతానికి పైగా (97.78 శాతం) ఉంది కాబట్టి, అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారాలు అంటున్నారు.
అయితే కరోనా ముప్పు తొలిగి పోయిందని అధికారులే గట్టిగా చెప్పలేక పోతున్నారు. అంట బాగుందని అంటూనే, మనం ఇంకా సెకండ్ వేవ్ ఉచ్చులోనే ఉన్నామని అంటున్నారు. అలాగే, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతునన్ నేపధ్యంలో, సెకండ్ వేవ్’తోనే కరోనా దేశం వదిలి పోతుందా? అంటే అధికారులు, నిపుణులు ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో, థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా? ఉండదా? ఇప్పుడు దేశంలోని చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలు కావచ్చని గతంలో కొందరు నిపుణులు అంచనావేశారు.
థర్డ్ వేవ్ ముప్పు అవకాశాలపై కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నిపుణులు థర్డ్ వేవ్ రాదని చెప్పకుండానే, వచ్చినా. దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తేల్చారు. తమ అంచనాల వెనుక బలమైన కారణాలను కూడా విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో చాలా మంది ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున.. థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే పేర్కొన్నారు.దేశంలో గణనీయ సంఖ్యలో జనాభా మొదటి డోస్, రెండో డోస్ వ్యాక్సిన్లు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తిని వ్యాక్సిన్ అడ్డుకుంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ సోకినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదన్నారు శేఖర్ సీ మాండే.
మరోవైపు దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కొత్త స్ట్రెయిన్, వ్యాక్సినేషన్ మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ వ్యాపించే తీవ్రతను బట్టి థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫసర్ మణింద్ర అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, ముప్పు పూర్తిగా తొలిగిపోకపోయినా, ప్రమాదం స్థాయి తగ్గిందని అదే సమయంలో సెకండ్ వేవ్ స్థాయి ప్రమాదం నుంచి బయట పడిందని ... అంటున్నారు. అయితే జాగ్రత్తలు పాటించకపోతే, ఎప్పుడైనా కరోనా మళ్ళీ విరుచుకు పడే ప్రమాదం ఉందని అంటున్నారు.