వైకాపాలోకి క్యూకట్టిన నేతలు
posted on Oct 30, 2012 @ 9:44AM
రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ పార్టీలోకి క్యూకట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయనీ ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు, పార్టీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చెంగల వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతానని రెండు నెలల క్రితమే ప్రకటించారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కృష్ణ బాబు, టీడీపీని వీడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభ ద్వారా యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది ఈరోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజే అరడజను మంది ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం గమనార్హం.