అబద్ధాలు రుజువైపోయి అభాసుపాలు..!
posted on Jun 27, 2022 7:53AM
అబద్ధాలాడేవారికి జ్ణాపక శక్తి ఎక్కువ ఉండాలి. అందులో రాజకీయ నాయకులైతే మరీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ విషయంలో ఏ అబద్దమాడారో మరచిపోతే.. వారి బండారం బయటపడి అభాసుపాలౌతారు. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఆడిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలలో పలుచన అవుతున్నారు. చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన చేసిన వాగ్దానాలు, విమర్శలు అన్ని ఇప్పుడు బూమరాంగ్ అయి.. ఆయన అబద్ధాల పాలనను వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు వివిధ సందర్భాలలో చెప్పిన మాటలు అబద్ధాలని ఇప్పుడాయన సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేటతెల్లమైపోతోంది.
దీంతో జనంలో జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిండు అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని నమ్మ బలికారు. ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మూడు రాజధానులంటూ అమరావతిని పక్కన పెట్టేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా యాతనా పెట్టారు. చారిత్రక న్యాయపోరాటం ద్వారా వారు ప్రభుత్వంపై విజయం సాధించినా.. కోర్టు తీర్పు అమలులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
గత మూడేళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుంది. ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితుల్లో మళ్లీ అమరావతే ఆదుకుంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ లోగా ఈ మూడేళ్లలో జగన్ కానీ, ఆయన పార్టీ నేతలకు కానీ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇన్నీ అన్నీ కావు. ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆదాయంగా మార్చుకునేందుకు నడుం బిగించింది.
గతంలో అమరావతిని స్మశానం గా అభివర్ణించిన జగన్ సర్కారే ఇప్పుడు ఆ భూములనే బంగారు బాతుగుడ్లుగా గుర్తించి వాటిని వేలం వేసి ఆదాయాన్నిసమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటూ ఎకసెక్కాలాడిన భవనాలనే ఇప్పుడు లీజుకు ఇచ్చి ఆర్థిక ఊరట పొందాలని నిర్ణయించుకుంటున్నది. దీంతో వైకాపా సార్కార్, ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అబద్ధాలని రాష్ట్రప్రజలకు తేటతెల్లమైంది. దీంతో జగన్ ప్రతిష్ట మసకబారింది. గతంలో అమరావతి భవనాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం వస్తుందన్న సీఆర్డీయే ప్రతిపాదనకు ఆమోదించడం ద్వారా తాను నాడు గ్రాఫిక్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఇప్పుడు స్వయంగా అంగీకరించినట్లైంది.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పలు టవర్లు, భవనాలను ఇంత కాలం నిరుపయోగంగా ఉంచేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వాటినే ఆదాయ వనరులుగా గుర్తించారు. ఉద్యోగుల కోసం గత సర్కార్ నిర్మించిన భవనాలను ఉద్యోగులకు కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. భవనాల లీజు ద్వారా ఏడాదికి పదికోట్లు ఆర్జించడానికి రెడీ అయిపోయింది. అమరావతిలో తెలుగుదేశం చేపట్టినట్లు చెబుతున్న పనులన్నీ గ్రాఫిక్సేనని ప్రచారం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడా ‘గ్రాఫిక్ భవనాల’నే అవసరానికి వాడుకుంటోంది.
స్మశానం అంటూ నిందించిన నోటితోనే అమరావతి భూముల విక్రయానికి రెడీ అయిపోతోంది. ఇప్పుడు జనం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేయకుండా ఉండి ఉంటే.. అప్పుడు జరిగిన అభివృద్ధిని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా అని నిలదీస్తున్నారు. యథా ప్రకారం జగన్ ప్రభుత్వం నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, విమర్శలు చేస్తే దులిపేసుకు ముందుకు పోతాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.