ముర్ము స్వగ్రామానికి వెలుగొచ్చింది
posted on Jun 27, 2022 @ 10:08AM
రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, చిన్న తనంలో గుడ్డి దీపాల వెలుగులో చదువుకుని అంత గొప్పవాడయ్యారు, అని మనం గొప్పగా చెప్పు కుంటాం... అలాగే ఇంకా ఎందరో పెద్దలు , స్వాతంత్ర సమర యోధులు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశ సేవలో తరించారు అలాంటి అందరూ మనకు ప్రాతః స్మరణీయులు,కానీ, దేశానికీ స్వతంరం వచ్చి, 75 ఏళ్ళు పూర్తయి, అమృత మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలో, ఇప్పటికీ దేశంలో విద్యుత్ సదుపాయం, కనీస వసతులు లేని అనాధ గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
అందునా, అలాంటి అనాధ గ్రామాల్లో, అధికార ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామం కూడా ఉందంటే, ఆశ్చర్యంతో పాటుగా కొంచెం చాలా అవమానం కూడా అనిపిస్తుంది. కానీ, అది నిజం. నిజానికి, దేశంలోని ఎన్నో చీకటి గ్రామాల కథల్లానే, ఈ గ్రామం కథ కూడా ఇప్పటికీ, ఎప్పటికీ చీకటిలోనే ఉండి పోయేది కావచ్చు, కానీ, ద్రౌపది ముర్మును బీజేపీ / ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే, అక్కడికెళ్ళిన మీడియా ప్రతినిధులు, రాష్ట్రపతి అభ్యర్ధి స్వగ్రానికి కరెంటు లేదని తెలిసి, కరెంట్ తాకకుండానే షాక్ కు గురయ్యారు.
ద్రౌపదీ ముర్ము స్వగ్రామం..ఓ శివారు గ్రామం. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రెండు శివారు గ్రామాలు కలిసిన, ఉపర్బెడా గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 3500 జనాభా నివసిస్తున్నారు. అందులో, బాదషాహి శివారు గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉంది. కానీ, కేవలం 14 కుటుంబాలు మాత్రమే ఉన్న దున్గురుషాహి శివారు గ్రామానికి మాత్రం విష్యత్ సదుపాయం లేదు.,ఆ శివారు గ్రామం దశాబ్దాలుగా చీకటిలోనే మగ్గుతోంది. ఆ గ్రామమే ముర్మూ స్వగ్రామం.అయితే, ప్రస్తుతం ఆమె అక్కడ నివసించడం లేదు. ఆ గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి కొన్ని దశాబ్దాల క్రితమే మకాం మార్చారు. అయినప్పటికీ ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్ తుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివసిస్తున్నారు. ముర్మూ కూడా పండగలు, పబ్బాలకు గ్రామానికి వచ్చి పోతూనే ఉంటారని, ఆమె మేనల్లుడు తెలిపారు. గ్రామానికి విద్యుత్ లేని విషయాన్ని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, బిరాంచి భార్య, ఇతర గ్రామస్తులు వాపోయారు. ఎన్నికల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ, ఎన్ని విజ్ఞాపన పత్రాలు అందించిన ఫలితం లేదని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పడు, రాష్ట్రపాటి అభ్యర్ధి గ్రామానికి విద్యుత్ లేదనే వార్త భగ్గుమండంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఒడిశా విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు 24 గంటల్లోగా గ్రామం మొత్తానికి విద్యుత్ వసతి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే, మయూర్‌భంజ్ జిల్లాలో ఇప్పటికీ ఓ 500 గ్రామాలకు సరైన రోడ్లు, 1350 గ్రామాలకు కరెంటు వసతే లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ గ్రామానికి చెందినవారు గతంలో ఎంపీలు, మంత్రులుగా పనిచేశారు. మాజీ ఎంపీలు సల్ఖాన్ ముర్ము, భబేంద్ర మాఝీతోపాటు కార్తిక్ మాఝీలు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం కొసమెరుపు. అయితే, తీగలాగితే డొంకంతాకదిలింది అన్నట్లు, ఈ గ్రామానికి ఇంత కాలం కరెంటు లేక పోవదానికి, ఆ గ్రామం పట్ల వివక్ష కారణం కాదని, అటవీ భూమిలో నిర్మించిన గ్రామం కావడం వలన సాంకేతిక అభ్యతరాలు అడ్డుగా నిలిచాయని, అధికారులు చెపుతున్నారు. అయితే, ఇంత కాలం తిష్ట వేసినఅభ్యంతరాలు ఇప్పడు ఏమయ్యాయి.. ? ఎలా తొలిగి పోయాయి? అలాంటి ప్రశ్నలకు సమాధానలు ఉండవు. అది అంతే.