పులివెందుల పులి జగన్ పలాయనం..!
posted on Jul 29, 2024 @ 11:14AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ దివాళాకోరు తనానికి ఓటమి తరువాత ఆయన తీరే నిదర్శనం. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. విజయంతో విర్రవీగి, ఓటమితో కృంగిపోవడం నాయకుడి లక్షణం కాదు. పార్టీని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు తనలో ఇసుమంతైనా లేవని జగన్ తన ప్రతి చేష్టతో, ప్రతి మాటతో, ప్రతి విమర్శతో రుజువు చేసుకుంటున్నారు. పులివెందుల పులిగా నిన్న మొన్నటి వరకూ ఆయన గురించి గొప్పగా చెప్పిన వైసీపీ నేతలూ, శ్రేణులూ కూడా ఆయన ధైర్యం గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడడానికి జంకుతున్నారు.
జగన్ హయాంలో చంద్రబాబు నాయుడుని శాసనసభలో వైసీపి ఎమ్మెల్యేలు దారుణంగా అవమానించారు. అప్పుడు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతాను అంటూ శపథం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. కౌరవ సభను గౌరవ సభగా మారుస్తాను అంటూ ప్రతిజ్ణ పూనారు. 2024 ఎన్నికలలో పార్టీకి గొప్ప విజయాన్ని అందించి, తన శపథం నెరవేర్చుకుని హుందాగా సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. కేవలం 23 మంది సభ్యులు మాత్రమే ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కృంగిపోలేదు. పార్టీని పటిష్టంగా నిలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా కాపాడుకున్నారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొన్నారు. రాజకీయ పోరాటం చేశారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారు.
అదే సమయంలో 2019 ఎన్నికలలో విజయం తరువాత జగన్ జనం ముఖం చూడలేదు. ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. విపక్ష నేతలను, కార్యకర్తలను వేధించడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు. సభలో విపక్ష నేతను, విపక్ష సభ్యులను అవమానించడమే సభా నిర్వహణ అనుకున్నారు. అభివృద్ధి అంటే విధ్వంసమే అన్నట్లుగా వ్యవహరించారు. సంక్షేమం అంటే బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడమే అని భావించారు. సరే ఐదేళ్ల జగన్ పాలన పట్ల తమ అభిప్రాయం ఏమిటన్నది ప్రజలు ఎన్నికలలో ఓటు ద్వారా విస్ఫష్టంగా వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ పాలనను తిరస్కరించారు. ఘోరంగా ఓడించారు.
అయితే ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. అర్హత లేకపోయినా తనకు విపక్ష నేత హోదా ఇవ్వాలంటూ దేబిరిస్తున్నారు. వైనాట్ 175 అన్న నోటితోనే ఇప్పుడు విపక్ష హోదా ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటున్నారు. గతంలో అంటే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నప్పుడు.. తాను చిటికేస్తే తెలుగుదేశం పార్టీకి విపక్ష హోదా లేకుండా పోతుందని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఆ హోదా కోసం వెంపర్లాడుతున్నారు. క్యాడర్ లో, నేతలలో విశ్వాసం పాదుకొల్పి పార్టీని కాపాడుకోవలసిన జగన్.. తనను కాపాడుకోవడానికి పార్టీ మీద, క్యాడర్ మీదా ఆధారపడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక.. మీడియా సమావేశాలలో ప్రసంగాలు చేస్తున్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్నారు. మొత్తంగా జగన్ ప్రజలను, విపక్షాలనూ ఫేస్ చేసే ధైర్యంలేక పలాయనం చిత్తగిస్తున్నారు.