ఆయన స్వామి కాదు.. జగన్‌కి భాగస్వామి!
posted on Jun 19, 2024 @ 12:03PM
ఐహిక బంధాలకు కాషాయం కడితే ఎలా వుంటుందో తెలుసా? ఎలా వుంటుందంటే, విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందలా వుంటుంది. ఈయన్ని అందరూ ‘స్వామి’ అని పిలుస్తూ వుంటారుగానీ, జగన్‌కి భాగస్వామి అని పిలిస్తే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ స్వామిగారు జగన్ మీద భక్తితో చంద్రబాబును విమర్శిస్తూనే వుండేవారు. ఈ దేవాలయంలో ఈ సమస్య వుంది.. ఆ దేవాలయంలో ఆ సమస్య వుంది.. హిందూ ధర్మం కష్టాల్లో పడిపోయింది అంటూ ఎప్పుడూ చెవిలో జోరీగలాగా అంటూనే వుండేవారు. ఆ తర్వాత ఆయన జగన్‌కి హిందుత్వం ఇచ్చి, హిందూ ఓటర్లని ఆకర్షించడానికి తనవంతు కృషి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరూపానందని బాగానే చూసుకున్నారు. ఆయనకి నలుగురు గన్‌మన్లతోపాటు ఆరుగురు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేయించారు. దీనికి నెలకు ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాలా 24 లక్షల రూపాయలు. నెలకు 24 లక్షల చొప్పున ఈ ఐదేళ్ళకి 14 కోట్ల 40 లక్షలు. ఎవడబ్బ సొమ్మని ఈ స్వామివారు ఇన్ని కోట్ల జనం సొమ్ముని నాశనం చేశారు? సన్యాసి అయిన ఈయనకి చంపేంత శత్రువులు ఎవరున్నారని ఈ సెక్యూరిటీ? దేశంలో ఏ సన్యాసికీ లేని సెక్యూరిటీ ఈయనకే ఎందుకు? ఒకవేళ ఈయనకి అంతగా ప్రాణభయం వుంటే, సొంత డబ్బుతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి గానీ, జనం సొమ్ముతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం ఏమిటి? వడ్డించేవాడు మనవాడే కదా, తేరగా సెక్యూరిటీ వస్తోంది కదా అని జనం సొమ్ముని కరిగించేశారు. స్వామిలా వుండాల్సిన ఈ పెద్దమనిషి, జగన్ చేసే దుబారా ఖర్చులో ఈయన కూడా ‘భాగస్వామి’ అయ్యారు. గురువే గుళ్ళో లింగాలు మింగేవాడు అయినప్పుడు, శిష్యుడు గుడినే మింగకుండా వుంటాడా? స్వరూపానంద, జగన్ విషయంలో ఇదే జరిగింది కదా..!