కొత్త ట్రెండ్! జగన్ దీక్ష స్థలంలో భూమి పూజ

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేసిన దీక్షలు, ధర్నాలకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చేది. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేయకపోయుంటే ఆ మాత్రం స్పందన కూడా వచ్చేది కాదేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరు ఏసి కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కనుక వైకాపా నేతలు ఆయన దీక్షను విజయవంత చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు. దాని కోసం వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే జగన్ దీక్షకు కూర్చోబోయే వేదిక వద్ద ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భూమి పూజ కూడా నిర్వహించడం. నిరాహార దీక్షలకి భూమి పూజలు చేయడమనే సరి కొత్త ట్రెండ్ ని వైకాపా ప్రవేశపెట్టింది.

 

జగన్ చేయబోయేది ఆమరణ నిరాహార దీక్ష అని వారు ప్రచారం చేసుకొంటున్నప్పటికీ గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అది ఎన్ని రోజులో ఏవిధంగా ముగుస్తుందో తేలికగానే ఊహించవచ్చును. ఆ మాత్రం దానికి భూమి పూజ వగైరా హడావుడి ఎందుకంటే బహుశః తమ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడానికేనని భావించాల్సి ఉంటుంది. తీరా ఇంత హడావుడి చేసిన తరువాత దానికి ప్రజల నుండి సరయిన స్పందన రాకపోయినట్లయితే అభాసుపాలుకాక తప్పదు. ఆ మధ్య జగన్ డిల్లీలో నిర్వహించిన ఐదు గంటల దీక్షని స్పాన్సర్ చేసిన బొత్స సత్యనారాయణే ఈ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం.

Teluguone gnews banner