జగన్ మెడికల్ రాజకీయం.. సెల్ఫ్ గోల్ అవుతుందా?
posted on Oct 9, 2025 @ 9:54AM
ఫ్యాన్ పార్టీ మరో తప్పటడుగు వేస్తోందా ? తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి పెట్టాలన్న తొందరలో అనాలోచితంగా వ్యవహరించి సెల్ఫ్ గోల్ చేసుకోబోతోందా? అంటే అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజలు అవుననే అంటున్నారు. ఎప్పుడైనా నాయకుడు పూర్తి చేసిన భవనం, పథకం గురించి పర్యటించి గొప్పగా చెప్పుకుంటారు గాని, అందుకు భిన్నంగా అసంపూర్ణంగా ఉన్న మెడికల్ కాలేజ్ భవనం చూపించి జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన కేవలం రాజకీయం మాత్రమే చేయబోతున్నారనీ, ఇది ఒకరకంగా వైసీపీకి సెల్ఫ్ గోల్ అవుతుందని ఫ్యాన్ పార్టీ నాయకులు కూడా మధనపడుతున్నారు
ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు ప్రతిపా దనలు చేశారు అందులో ప్రస్తుత అనకాపల్లి లో నిర్మాణానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు కానీ ఆ స్థలం వివాదం కావడంతో అనకాపల్లికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద 52.15 ఎకరాల భూమిలో 20 22 డిసెంబర్ 28న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 500 కోట్ల రూపాయలఅంచనాతో ఏడు అంతస్తులలో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. కానీ మూడు అంతస్తులకు మాత్రమే వేయడం జరిగింది . మిగిలిన నాలుగు ఐదు భవనాలకు పిల్లర్లు వేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఎన్నికల ముందే నిలిపివేశారు. ఇప్పటి వరకు దాదాపు పాతిక కోట్ల రూపాయలను ఈ మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి వెచ్చించినట్టు అధికారులు తెలిపారు.
అయితే కేంద్రం ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణ ప్రతిపాదన చేసింది. కానీ నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్రం అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు . ఏపీలో ఏడు మెడికల్ కాలేజీలకు దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు మచిలీపట్నం లో మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా నిర్మాణ పనులు పూర్తి చేపట్టాలని కొన్నిసార్లు ప్రభుత్వాలు భావిస్తాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రీతిన జగన్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని భావించారు. అయితే తాజా కూటమి ప్రభుత్వం అసంపూర్ణంగా మిగిలిన మెడికల్ కాలేజీ లను పిపిపి పద్ధతిలో పూర్తి చేయాలని ప్రతిపాదన చేసింది.
దీన్ని సహజంగానే ఫ్యాన్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పటికే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయి విద్యార్థులు అడ్మిషన్ లు జరిగిన కాలేజీని కాక అసంపూర్ణంగా ఉన్న నర్సీపట్నం కాలేజీని ఎంచుకోవడం కేవలం రాజకీయం కోసమే అని పరిశీలకులే కాదు, కొందరు వైసిపి నాయకులు కూడా అంటున్నారు. కేవలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజవర్గంలో రాజకీయం చేసేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన పెట్టుకున్నారనీ, దీని వల్ల సెల్ఫ్ గోల్ చేసుకోవడం వినా మరో ప్రయోజనం సిద్ధించదని చెబు తున్నారు.