Read more!

చివరకు మిగిలేది ఆ నలుగురేనా?

జగన్ చేతులు కాలాయి. పట్టుకుందామనుకున్న ఆకులు దొరకడం లేదు. జగన్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన పరాభవం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ కొనసాగిందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఎదురౌతుందన్న విశ్లేషణల నేపథ్యంలో గతనాలుగేళ్లుగా తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్నజగన్ పార్టీ ఈ వరుస పరాభవాలను జీర్ణించుకోలేకపోతోంది. బయటకు ఎమ్మెల్సీ ఎన్నికలతోనే పార్టీలో జగన్ కు వ్యతిరేకత ఆరంభమైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఏడాదికి ముందే పార్టీపై జగన్  పట్టు సడలడం ఆరంభమైందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.  

ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ తన కేబినెట్ లో మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవులలో ఉంటారనీ, రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను సమూలంగా మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తారనీ ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటనను అందరూ స్వాగతించారు. సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇలా చేయడం వల్ల   మంత్రుల బాధ్యతతో పని చేయడమే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారనీ అంతా భావించారు. అయితే జగన్ తాను చెప్పినట్లుగా రెండున్నరేళ్లకు కేబినెట్ ను సమూలంగా మార్చలేదు. మూడేళ్ల తరువాత ఆయన చేసినది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే తొలి కేబినెట్ లో ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన పలికి మరి కొందరిని చేర్చుకున్నారు. అంతే దానికి కూడా భయం భయంగా ఎవరిని మారిస్తే ఏం సమస్య వస్తుందో అని ఒకటికి పది సార్లు కసరత్తులు చేసి నిర్ణయాలను పదే పదే మార్చుకున్నారు.

ఇంత చేసినా అప్పట్లో అసమ్మతి భగ్గుమంది.  నెలల తరబడి అసమ్మతి కొనసాగింది. మూడేళ్లుగా జగన్ మాటే వేదం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ అంతా పేకమేడే అని తేలిపోయింది.  ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ ఎంతగా గుప్పెట మూసి ఉంచినా ఆ వేళ్ల సందులోంచి పార్టీ ప్రతిష్ట జారిపోయిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం అదీ కూడా సొంత ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం వైసీపీకి కోలుకోలేని షాక్ గా చెప్పవచ్చు.  ఇక రాజకీయ వర్గాలలో అయితే ఇక వైసీపీ జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ కు చేస్తున్న ప్రయత్నంగానే చర్చ జరుగుతోంది. జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ అంటే జారి పడటంగానే వారు అభివర్ణిస్తున్నారు.  అంతే కాకుండా  జగన్ పార్టీకి రాజకీయ పతనం ఆరంభంగానే చెబుతున్నారు.  నాలుగేళ్లలోనే పార్టీ పరిస్థితి ఇలా దిగజారడానికి జగన్ రెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా ఈ నాలుగేళ్లూ ప్రభుత్వాన్ని నడిపిన తీరే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని చెబుతున్నారు. 

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక సీటు కోల్పోవడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటడమే కారణమని జగన్ పార్టీ చెప్పడాన్ని కూడా పరిశీలకులు తప్పుపడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారిని నమ్ముకోవడం కంటే దివాళా కోరుతనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ నలుగురూ తాము క్రాస్ వోటింగ్ కు పాల్పడలేదని మీడియా ముందుకు వచ్చి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత తమ విజయానికి క్రాస్ ఓటింగ్ ఎంత మాత్రం కారణం కాదని చెబుతున్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ పంచుమర్తి అనూరాథకే ఓటు వేశారనీ, అందుకే ఆమె 23తో విజయం సాధించిందనీ చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నా.. తెలుగుదేశం నుంచి గెలిచి.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలూ తాము వైసీపీ అభ్యర్థికే ఓటు వేశామన్న మాట చెప్పడం లేదు. అటువంటప్పుడు వైసీపీ అధినేత తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎలా నిర్ధారించగలరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కట్టు దాటకుండా ఉండటానికి జగన్ పకడ్బందీ చర్యలే తీసుకున్నారు. అసంతృప్తులను గుర్తించి వారని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. బుజ్జగించారు. వారి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.  ఇంత చేసినా జగన్ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. అంటే స్వయంగా పార్టీ అధినేత పిలిచి మాట్లాడినా, బుజ్జగించినా, వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించినా.. వినకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడటమంటే.. ఆయన మాట చెల్లుబాటు కాకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే జగన్ మాట పార్టీలో చెల్లుబాటు కావడం లేదంటే.. ముందు ముందు ధిక్కార స్వరాలు మరిన్ని ఉంటాయనడానికి సంకేతంగానే చూడాల్సి ఉంటుంది.

నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ ద్వారా పార్టీలో  ఉన్న అసమ్మతిని చల్లార్చాలని ప్రయత్నించడమంటే.. ఉన్న మంటపై నీళ్లకు బదులు పెట్రోలు పోయడమే అవుతుందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే పలువురికి టికెట్లు ఉండవు అని మీటింగ్ లు పెట్టి మరీ ప్రకటించిన జగన్ ఇప్పుడు ఏ హామీ ఇచ్చి వారిని సముదాయించగలరని అంటున్నారు.   ఏది ఏమైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు ఎదురైన పరాభవం పార్టీపై సడలిన ఆయన పట్టుకు సంకేతంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముందు ముందు ఆ పట్టు మరింత సడలుతుందనీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలను నమ్మకుండా బటయ నుంచి వచ్చిన వారినే దగ్గరకు చేర్చుకుంటున్న ఆయన తీరు కారణంగా భవిష్యత్ లో ఆ బయటి వారు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.