Read more!

జగన్ పై వాళ్లకీ నమ్మకం పోయిదా?

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌పై  ఆయన సొంత సామాజిక వర్గమే నమ్మకం  కోల్పోయిందా?   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు సాక్ష్యమా అంటే రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది.    నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురిలో ముగ్గురు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు. అసలు గత ఎన్నికలలో నెల్లూరు జిల్లా వైపీపీకి పదికి పది అసెంబ్లీ స్థానాలనూ కట్టబెట్టింది. ఇప్పుడు ఆ జిల్లాకే చెందిన ముగ్గురు కీలక పెద్దా రెడ్లనే పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ కు పల్పడ్డారంటూ జగన్ సస్పెండ్ చేశారు.  

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పెద్దా రెడ్లూ కూడా తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదనే అంటున్నారు. అదే సమయంలో తమపై విశ్వాసం ఉంచని జగన్ పై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే  గత కొంత కాలం నుంచీ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నవారే. ఇక మూడో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అయితే ఇంత కాలంగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని అంటున్నారు. అసలు వైసీపీ మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి సజ్జలకు తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఎలా తెలిసిందంటున్నారు. ఏకపక్షంగా తనపై నింద మోపి పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూనే.. తన సస్పెన్షన్ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తానిప్పుడు ఫ్రీ బర్డ్ నని మేకపాటి వ్యాఖ్యానించారు.  అదలా ఉంచితే.. అయితే గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణం జగన్ తీరేనని పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీస్తున్న ఎదురుగాలికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019లో పార్టీలకు అతీతంగా జగన్ సామాజిక వర్గం మొత్తం వైసీపీకి మద్దతు పలికిందనీ, ఇప్పుడు అదే సమాజిక వర్గంపార్టీలకు అతీతంగా ఆయనకు వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు.   ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా అనే కాదు.. జగన్ సామాజిక వర్గానికి చెంది ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వారి సంఖ్య   ఉమ్మడి కడప జిల్లా నుంచి మొదలు  అనంతపురం, కర్నూలు, చిత్తూరు,  ప్రకాశం జిల్లాల్లో కూడా ఘనంగానే ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

ఇంకోవైపు  జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఒక సామాజిక వర్గాన్ని  లక్ష్యంగా చేసుకొన్నారనీ,  ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి అంటూ ప్రతిపక్ష నేతగా మద్దతు ప్రకటించిన ఆయనే స్వయంగా   అధికారం చేపట్టిన తరువాత మాటమార్చి, మడమతిప్పి మూడు రాజధానులంటూ ప్రకటించిన విషయాన్నిపరిశీలకులు గుర్తు చేస్తున్నారు.