అష్టదిగ్బంధనంలో జగన్.. కాపాడడం ఎవరితరం?!
posted on Dec 27, 2023 @ 3:12PM
వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ ఓటమి ఖాయమన్న విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. తన ఓటమి తప్పదన్న విషయం జగన్ కు కూడా ఇప్పటికే అర్ధమైపోయింది. జగన్ కు ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కూడా చేతులెత్తేసింది. అయితే అగ్రిమెంట్ లో భాగంగా ఎన్నికలు అయ్యే వరకూ వైసీపీ కోసం పనిచేయాల్సిందే. నాలుగున్నరేళ్లగా ఐప్యాక్ ప్రతినిధుల మాటను కూడా జగన్ పట్టించుకోకపోవడం, ఐప్యాక్ ఉద్యోగులలో కూడా చీలిక తెచ్చి సొంతంగా శిబిరం ఏర్పాటు చేసుకోవడంపై ఆ సంస్థ ప్రతినిథులు కూడా జగన్ పై గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఉన్నంతలో పనిచేయాలి కనుక అభ్యర్థులను మార్చాలని ఓ సలహా పారేసి ఐప్యాక్ చేతులు దులిపేసుకుందని అంటున్నారు. ఇక వైసీపీ సిట్టింగులు కూడా ఓటమి ఖాయమన్న భావనతో ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏంటి అంటూ ఎమ్మెల్యేలు ఉసూరుమంటున్నారు. వైసీపీలోనే ఉండి ఓటమి మూటగట్టుకోవడం ఇష్టంలేని వాళ్లంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. మొత్తంగా అభ్యర్థుల మార్పు ఇప్పుడు జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వైనాట్ 175 అన్న జగన్ ఇప్పుడు 175 స్థానాలలొ పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పనిలో పడ్డారు.
తనకి తెలిసో తెలియకో.. నన్నేం చేస్తార్లే అనే అహంకారంతో .. నేనేం చేస్తే అదే రైట్ అనే భ్రమల్లో జగన్ ఈ నాలుగున్నరేళ్లలో తనని తానే అష్టదిగ్భంధనం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఆ దిగ్బంధనం నుంచి బయటపడే మార్గం లేక గిలగిలలాడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ బటన్ నొక్కుడుకు తప్ప సమాజంలో ఏ వర్గానికి ఏమీ చేసింది లేదు. ప్రజలు తమ అసంతృప్తిని ఎన్నికల సమయంలో ఓటు ద్వారా చూపుతారు కానీ, కానీ, ఉద్యోగులు అలా కాదు. ఎన్నికలకు ముందే పాలకుల భరతం పడతారు. సరిగ్గా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు, ప్రభుత్వ వర్గాల నుంచి అసంతృప్తి సెగలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్యోగ వర్గాలు ఇప్పుడు నిరసనలతో, ఆందోళనలతో ఉగ్రరూపం దాల్చాయి. తమకిచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీస్తున్నాయి. ఇన్నాళ్లు ఒకరిద్దరు ఉద్యోగ నేతలను గుప్పిట్లో పెట్టుకుని జగన్ ఉద్యోగుల అసంతృప్తిని అణిచేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఉద్ద్యోగుల ఆగ్రహాగ్ని తమనే దహించేసేలా ఉండటంతో.. ఆ ఒకరిద్దరు ఉద్యోగ నేతలూ కూడా జగన్కు ముఖం చాటేశారు. అంతే కాదు ముఖం చెల్లకు ఉద్యోగులకు కూడా కనిపించలేని పరిస్థితిలో వారు పడ్డారు.
నిన్నటిదాకా జై జగన్, ఆహా జగన్, ఓహో జగన్.. జగనంటే మనిషి రూపంలో దేవుడంటూ కీర్తిస్తూ భజన చేసిన ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు జగన్ అంటే రాక్షసుడు.. ఇన్నాళ్లు భయపడే భజన చేయాల్సి వచ్చిందని బాహాటంగానే చెబుతున్నారు. నాలుగేళ్లుగా మా మాటని పెడచెవిన పెట్టిన జగన్కు తగిన శాస్తి చెప్పాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక జగన్ తనకు కొండంత అండగా భావిస్తున్న ఢిల్లీ అండ కూడా మాయమైంది. మనకి ఢిల్లీ పెద్దలు అండగా ఉన్నారంటూ ఇన్నాళ్లూ నాయకులు, కార్యకర్తల్లో భరోసా నింపారు. కానీ ఇటీవలి కాలంలో జగన్ పై, జగన్ పాలనపై బీజేపీ విమర్శల జడివానను చూస్తున్న పార్టీ శ్రేణులు జగన్ మాట నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కేంద్రం నుండి అండ లేదన్నది వారికి స్పష్టమైపోయింది.
ప్రతిపక్షాలు ఏకం కాకుడదని జగన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెలుగుదేశం, జనసేన పొత్తు రోజు రోజుకూ బలోపైతమై రెండు పార్టీలూ ఏకతాటిపై నడుస్తున్నాయి. కానీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలు, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు జగన్ ను ఆయన పార్టీని ప్రజలు చీదరించుకునే పరిస్థితికి తీసుకు వచ్చాయి.
మరోవైపు సరిగ్గా సమయం చూసి తాను సంధించిన బాణం రివర్స్ అయ్యింది. గత ఎన్నికలలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. తనను అవసరానికి వాడుకొని పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి తరిమేసిన అన్నను దెబ్బతీసి రాయలసీమ బిడ్డ పౌరుషం చూపేందుకు కంకణం కట్టుకుని రెడీ అయిపోయారు.
ఇన్నాళ్లు ఏపీ అనే సామ్రాజ్యానికి తానే రారాజుగా భావిస్తూ తాడేపల్లి ప్యాలస్ లో కలలు కన్న జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైయ్యేసరికి తత్వం బోధపడింది. పరిస్థితి చేయి జారిపోవడంతో ఇప్పుడు తనను, తన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఇక ఇప్పుడు జగన్ ఏం చేసినా, ఎంత మంది సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చినా ఒరిగేదేం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.