పులివెందులలో జగన్ కారుపై రాయి.. దివ్యాంగుడి ధర్మాగ్రహం
posted on Dec 28, 2023 8:42AM
జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ జగన్ పట్ల అదే వ్యతిరేకత కనిపిస్తున్నది. జగన్ సొంత జిల్లా కడపలోనూ, ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ కూడా జనం జగన్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలే ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయింది. ఉపాధి, ఉద్యోగావకాశాల ఊసే లేదు.
అయితే తన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసిందనీ, విపక్షాలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేననీ నమ్మించడానికి ప్రయత్నించడమే కాదు, తన విధానాలను వ్యతిరేకించే వారిపై దాడులు, కేసులు, వేధింపులకు పాల్పడటం జగన్ నైజంగా మారింది.
విపక్ష నేత రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంటే వైసీపీ మూకలు దాడులకు ప్రయత్నించాయి. యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార దుర్వినియోగానికి సైతం వెనుకాడలేదు. ఏకంగా జీవో 1 తీసుకువచ్చారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెడితే ఆయన బస్సుపై రాళ్ల దాడి జరిగింది. ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడేనని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా ఆ దాడి చేసిన వారు కూడా బయట నుంచి వచ్చారని తేలింది. ఈ దాడిని అప్పటి డీజీపీ సవాంగ్ ప్రజాస్వామ్య భావ్యక్తీకరణగా సూత్రీకరించారు.
తెలుగుదేశం కార్యాలయంపై మారణాయుధాలతో జరిగిన దాడికి నేతృత్వం వహించిన జోగు రమేష్ పై కేసుల సంగతి పక్కన పెట్టి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ప్రజాగ్రహం దాడులకు దారితీయడం సహజమేననీ, ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత చాటేందుకు అది ఒక మార్గమనీ ఘనత వహించిన వైసీపీ నేతలు సూత్రీకరించారు. ఆ సూత్రీకరణలకు సీఎం జగన్ షిక్కటి చిరునవ్వుతో ఆమోదం తెలిపారు.
మరి ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా ఆయన సొంత ఇలాకా పులివెందులలోనే చిన్నపాటి దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఎలాంటి రాజకీయ కారణాలూ లేవు. దాడి చేసింది ఓ దివ్యాంగుడు. ఇచ్చిన హామీలను విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ తీరుపై ధర్మాగ్రహంతో ఆయన కాన్వాయ్ పై ఓ రాయి విసిరారు. ఆ రాయి ఇంటెలిజెన్స్ పోలీసుల కారును తాకింది. జగన్ క్రిస్మస్ వేడుకల కోసం తన సోంత ఊరు పులివెందుల వెళ్లారు. ఆ సందర్భంగా సింహాద్రిపురం మండలంలో ఆయన పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఈ సంఘటనను రాష్ట్ర పోలీసులు భావవ్యక్తీకరణగా తీసుకోలేదు. రాయి విసిరిన దివ్యాంగుడిని అదుపులోనికి తీసుకుని రెండు రోజుల పాటు దారుణంగా హింసించారు. చిత్ర హింసలకు గురి చేశారు. రాయి విసిరిన ఆ దివ్యాంగుడు రాజకీయ వైరంతో ఈ పని చేయలేదు. అర్హుడైన తనకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వని జగన్ సర్కార్ పై ధర్మాగ్రహాన్ని అలా వ్యక్తం చేశాడు. నాలుగున్నరేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కడుపుమండి ఓ రాయి విసిరాడు. అయితే విపక్ష నేత బస్సుపై రాళ్లు విసిరిన రౌడీ మూకలది ప్రజాస్వామ్య భావవ్యక్తీకరణగా చెప్పిన పోలీసులు దివ్యాంగుడి ధర్మాగ్రహాన్ని మాత్రం ఘోర నేరంగా భావించి చిత్రహింసలు పెట్టారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ కాన్వాయ్ పై రాయి విసిరిన దివ్యాంగుడు వైసీపీ అభిమాని, అంతకు మించి జగన్ కు వీరాభిమాని. అయినా జగన్ పాలనలో అర్హులకు అందాల్సినవేవీ అందడం లేదన్న కోపంతో ఓ రాయి విసిరాడు. అమరావతిలో చంద్రబాబు బస్సుపై రాళ్లు వేసిన వ్యక్తులను కనీసం అదుపులోనికి కూడా తీసుకోకుండా భావ వ్యక్తీకరణకు అదో మార్గం అని చెప్పిన పోలీసులు పులివెందులలో జగన్ కారుపై రాయి వేసిన దివ్యాంగుడిని మాత్రం రెండు రోజుల పాటు తమ అధీనంలో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేశారు. చివరికి అతడు వైసీపీ వ్యక్తే అని తేలడంతో వదిలి పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జగన్ పట్ల జనాగ్రహం ఏ రేంజ్ లో ఉందో తేటతెల్లం చేస్తోంది.