అప్పుల కోసం సర్కస్ ఫీట్లు.. జగనన్న పాలనతో తనఖాలో ఏపీ!
posted on Oct 8, 2021 @ 5:06PM
"మీసాలకు సంపెంగ నూనె" గురించి తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కాకపోతే ఏపీలో జగన్ సర్కారు పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉండడం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. జగన్ పాలనకు ఆహా, ఓహో అంటూ సరికొత్త అలంకారాలు తగిలిస్తున్న ఆయన వందిమాగధులు, వైసీపీ క్లోజ్డ్ సర్కిల్లో ఉండే పలువురు ప్రముఖులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెదవి విరుస్తున్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న జగన్ అపరిపక్వ హ్యాండ్లింగ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రజల మీద అనుకోని పన్నులు ఏ క్షణాన, ఏ రూపంలో పడతాయోనని, ఆగ్రహం పెల్లుబుకుతున్న ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలని వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో కొద్ది నెలల క్రితం వరకు పలు ప్రభుత్వ విభాగాలు, కొన్ని కార్పొరేషన్ల ఉద్యోగులకు వేతనాలు కూడా సమయానికి అందించలేకపోయిన వైనం గుర్తుకొచ్చి నిలువునా షేకవుతున్నారు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో.. పాత అప్పులు తీర్చడం కాదు కదా... కొత్త అప్పుల అన్వేషణ కోసం ఆర్థిక శాఖ అధికారుల చేత సర్కస్ ఫీట్లు చేయిస్తున్న జగన్ సర్కారు తెంపరితనం మీద ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త అప్పులు పుట్టాలంటే జగన్ ప్రదర్శిస్తున్న గారడీ విద్యలను బహుశా గతంలో ఏ సీఎం కూడా అనుసరించలేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అప్పుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టడం మినహా మరో గత్యంతరం లేని దుస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. అధికారమే పరమావధిగా ప్రజాకర్షక పథకాలకు పదునుపెట్టి దూరదృష్టి లేకుండా ప్రజల్ని బురిడీ కొట్టించి పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. అయితే అతిశయించిన మూర్ఖావేశంలో మరిన్ని ఎక్కువ తప్పులు చేయడం రాజకీయ నాయకుల సహజ నైజమే కాబట్టి... అదే ఇప్పుడు ఆంధ్రా ప్రజానీకాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్త అప్పుల కోసం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) చేత అమలు చేయించిన వ్యూహాన్నే రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) చేత కూడా చేయించేందుకు జగన్ నిర్ణయించినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 20 ఏళ్ల పరిమితితో కొత్త అప్పులు తేవడానికి జగన్ సర్కారు నిర్ణయించింది. అయితే అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ల ఉనికి ప్రమాదంలో పడిపోతుందని, ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని, కార్పొరేషన్ పరిధిలోని ఆస్తులకు ప్రభుత్వ గ్యారెంటీ చేజారిపోతుందని, ఫలితంగా అప్పులు ఇచ్చిన బ్యాంకుల నిర్ణయాధికారమే పైచేయి అవుతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ. 18,500 కోట్లు తీసుకుని వివిధకార్యక్రమాలకు మళ్లించారు. అందులో మిగిలిన కార్యక్రమాలు కొనసాగాలన్నా, పూర్తి కావాలన్నా ఈ సంవత్సరం రూ. 19 వేల కోట్లు అవసరమవుతాయని తేల్చారు. వాటిలో ఈ సంవత్సరం అవసరాలకు గాను ఇప్పటికే రూ. 6500 కోట్ల లోన్ ప్రాసెస్ పూర్తయింది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల కన్సార్షియం దశలవారీగా రుణాలు మంజూరు చేస్తుంది. ఏపీఎస్డీసీ తన ఒప్పందాల మేరకు ఇప్పటికి రూ. 25 వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఈ సంవత్సరం రూ. 6500 కోట్లు తీసుకునే ప్రక్రియ పూర్తి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను గాడిలో పెట్టడంలో జగన్ సర్కారు విఫలం కావడం వల్లనే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అందుకే సింగిల్ బ్యాంకుగా కాక ఐదు బ్యాంకులు కలిసి ఓ కన్సార్షియంగా ఏర్పడి రుణాలు మంజూరు చేయడం గమనించాల్సిన అంశం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా గాడి తప్పిందో అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఏపీఎస్డీసీ దారిలోనే ఏపీఆర్డీసీ పయనించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుల కోసమే ఏపీఆర్డీసీ పరిధిలో ఉన్న రూ. 3786 కోట్లకు పైగా ఆస్తులు బదలాయించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఏపీఆర్డీసీ అప్పులు తీర్చేందుకు పెట్రోలు, డీజిల్ పై సెస్సు మినహా మరో మార్గం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో లీటరు ఇంధనంపై ఒక్క రూపాయి సెస్సుతో రూ. 3 వేల కోట్ల రుణాన్ని ప్రతిపాదించారు. ఇలా తెచ్చిన అప్పులను వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. ఏపీలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు అవసరం అవుతున్నాయి. దీనికోసం రూ. 16 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో 9 వేల కోట్ల రుణాలు రాబట్టడానికే దాదాపు ఏడాది కాలంగా ఆర్థిక శాఖ నిపుణులు కుస్తీలు పడుతున్నారు. సింగిల్ గా ఏ ఒక్క బ్యాంకు కూడా ఏపీ సర్కారుకు రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆస్తుల బదలాయింపు ప్రక్రియను ఆధారం చేసుకొని ఐదు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డ విషయం గమనించాలంటున్నారు. అందుకే బ్యాంకుల కన్సార్షియం రుణాలు చెల్లించడానికి మొగ్గు చూపిందని సమాచారం. ఇక నాబార్డు నుంచి తీసుకునే అప్పులను 20 ఏళ్ల పరిమితితో తీర్చేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చింది.
తెలుగు ప్రజలందరికీ తెలిసిన యండమూరి వీరేంద్రనాథ్ ఇటీవల ప్రభుత్వాలు చేస్తున్న ఇష్టారీతి అప్పులపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం ప్రజల్ని మభ్యపెట్టి హామీలు గుప్పించడం, వారికి ఆకర్షక పథకాలు ఎర వేయడం వల్ల ప్రభుత్వంపైనే ఆధారపడతారని, శ్రమశక్తిని, మానవ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే సెక్షన్ కనుమరుగవుతుందని, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బ తింటుందని, మరోవైపు కార్పొరేట్ కంపెనీలు కూడా ఉత్పత్తి మానేసి ప్రభుత్వ సబ్సిడీల కోసం వెంపర్లాడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మినహా మరో మార్గం లేదని కూడా పలువురు మేధావులు ఇప్పటికే పలు వేదికల మీద చర్చిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అంటున్నారు.