అప్పుల వేటలో ఏపీ సర్కార్.. జనాలకు గండమేనా?
posted on Oct 8, 2021 @ 4:17PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు తీసి ... మరో అడుగు వేసిందంటే .. అది ఖచ్చితంగా ఒక అప్పులోంచి మరో అప్పులోకే, అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. రెండున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది అదే. కాబట్టి సందేహించవలసిన అవసరమే లేదు.అందుకే,ఏపీ అంటే, ఆర్థిక, రాజకీయ పరిభాషలో అప్పుకు పర్యాయపదంగా ముద్ర పడిపోయింది. ఓ వంక ముఖ్యమంత్రి, అయన ఆదేశాలతో మంత్రులు, కొత్త అప్పుల కోసం అధికారుల వెంట పడుతుంటే, అధికారులు పాత అప్పుల లెక్కల్లో తలమునకలై ,బ్యాకుల నుంచి వస్తున్న ఓవర్ డ్యూ,నిరర్ధక అస్తుల తాకీదులకు సమాధానాలు చెప్పుకోలేక, తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖలో, ఇప్పుడు ఇదే విషయంపై చర్చోప చర్చలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆర్థిక కార్యకలాపాలను, రెండే రెండు విషయాలకు పరిమితం చేసిందనే అభియోగాన్ని మోస్తూనే ఉంది.అందులో,ఒకటి ఓటర్లకు క్రమం తప్పకుండా మేత వేయడం. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేయడం.ఇక రెండవది, అందుకోసం, అందిన కాడికి అప్పులు చేయడం.బ్యాకులు, నాబార్డ్ వంటి కేంద్ర సంస్థలు,వివిధ పథకాల పేరున విదేశీ బ్యాంకులు..విదేశీ ఆర్థిక సహకార సంస్థలు ఇవీ అవీ అని కాదు, అప్పు ఎక్కడ పుడుతుందంటే అక్కడికల్లా పరుగులు తీసి,రెక్కలు కట్టుకుని వాలిపోవడం,చేతులు చాచడం, ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారి పోయిందనే మాట, సర్వత్రా వినిపిపిస్తోంది.
ఇలా చేసిన అప్పులకు నిర్దిష్ట గడువులో వాయిదాలు, వడ్డీ చెల్లించాలి,లేదంటే పరవు పోవడమే కాదు, ఇక అప్పులు పుట్టే మార్గమే లేకుండా పోతుంది.అయినా, ఏపీ ప్రభుత్వ ఖజానా నిండుకోవడంతో ఈ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దీంతో కొన్ని వాయిదాలు ఓవర్ డ్యూ అవుతున్నాయి. ఇంతవరకు అయితే రాష్ట్ర ఆర్థిక పతనం ఓవర్ డ్యూ వద్దనే ఉంది. ఈ గీత /గడువు కూడా దాటిపోతే అవి ఎన్‌పిఎలుగా మారిపోవడానికి చివరి అంచున ఉంటున్నాయి.అంటే, ఇవే విధానాలు కొనసాగితే, పరిస్థితి విషమిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక విధంగా చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా, బద్దలయ్యే బెలూన్’ లా అప్పులతో నిండి ఉందని ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.ఇక్కడ తెచ్చిన అప్పులు అక్కడ, అక్కడ తెచ్చిన అప్పులు ఇక్కడా సర్డుబాటు చేసి బండిని నెట్టు కొస్తున్నామని అధికారాలు వాపోతున్నారు.అలా సర్దుబాటు కుదరని పక్షంలో, ఒక సంస్థ ఎన్‌పిఏలోకి చేరితే ఆ సంస్థకు ఆ బ్యాంకు నుంచి మళ్లీ రుణం పుట్టే అవకాశాలు ఉండవు.
అయితే అనేక సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ఎన్‌పిఏలోకి చేరిన సంస్థను పక్కనపెట్టి, కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థల ద్వారా రుణాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు ఓవర్‌డ్యూలే తప్ప ఎన్‌పిఏ జాబితాలోకి వెళ్లడం జరగలేదు. అయితే దానికి అతి దగ్గరగా మాత్రం అనేక సంస్థలు ఉన్నాయి. ఒక వేళ ఎన్‌పిఏలోకి చేరితే కొత్తగా ఏర్పాటుచేసిన అనేక సంస్థలు ఉన్నాయని, వాటి ద్వారా రుణాలు తీసుకుంటామని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.అదలా ఉంటే, ప్రభుత్వం ఆర్టీసీ, రోడ్లు భవనాలు ఇలా వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తులను కుదువ పెట్టి అందినకాడికి అప్పులు చేస్తూనే ఉంది. ఈ నేపద్యంలో, వైసీపే ప్రభుత్వం పదవీకాలం ముగిసే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థితికి దిగజారుతుంది అంటే ... జవాబు భయంకరంగా ఉంటుందని అంటున్నారు.
అదలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుకో అప్పు పత్రాన్ని బయటకు తీస్తోంది. తాజాగా, రాష్ట్రంలో కొత్తగా వైద్య కలశాల నిర్మాణం, పాత కళాశాలల అభివృద్ధి పేరిట, రూ.9వేల కోట్ల అప్పుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐదు బ్యాంకుల కన్సార్టియం ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి అప్పు ఇవ్వడమా, ఇవ్వక పోవడమా అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి.రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మించడంతో పాటుగా పాత కళాశాలల అభివృద్ధికి మొత్తం రూ.16వేల కోట్లు అవసరమని ఏడాది క్రితమే అధికారులు లెక్కలు సిద్దంచేశారు. అప్పటినుంచి అధికారులు బ్యాకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, పని కాలేదు. ఇప్పుడు చిట్టచివరకు ఐదు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి సానుకూలంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ఒక ప్రధాన కారణంగా అయితే, వైసీపీ ప్రభుత్వం విస్వనీయత మీద అనుమానాలు బలపడడం మరో కారణంగా ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అడుగు తీసి అడుగువేయాలంటే అప్పే ఆధారం కావడం ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం అనారోగ్యంతో కునారిల్లుతొందనేందుకు కూడా ఇది నిదర్శనమని అంటున్నారు.