తిరిగొచ్చిన జగన్.. బూరెల్లాగా బుగ్గలు!
posted on Jun 1, 2024 @ 10:29AM
ముఖ్యమంత్రిగా చివరి గంటలను ఆస్వాదిస్తున్న జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి వచ్చారు. దాంతో, జగనన్న తిరిగి వస్తాడా, రాడా అని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. జగనన్న తిరిగొచ్చాడు కాబట్టి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం గన్నవరం విమానాశ్రయానికి వేల సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. భారీగా హడావిడి చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మొత్తమ్మీద జగన్ తిరిగొస్తాడా రాడా అని ఇంతకాలం జనంలో హల్‌చల్ చేసిన సస్పెన్స్.కి తెరపడింది.
ఇదిలా వుంటే, విమానంలోంచి దిగిన జగన్‌ని చూసి వైసీసీ నాయకులు ఆశ్చర్యపోయారు. లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కే సమయంలో కళ తప్పి, కాంతివిహీనం అయిపోయి వున్న ఆయన ముఖం ఇప్పుడు రంగు తేలింది. మిలమిలలాడుతోంది. ముఖ్యంగా బుగ్గలయితే బూరెల్లాగా పొంగాయి. యూరప్‌లో రెస్టు బాగా తీసుకున్నారో లేక ట్రీట్‌మెంట్ ఏమైనా చేయించుకున్నారోగానీ, జగన్ ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.